ఏపీలో మంచి రోజులు వస్తాయి: పవన్ కళ్యాణ్

- November 11, 2022 , by Maagulf
ఏపీలో మంచి రోజులు వస్తాయి: పవన్ కళ్యాణ్

విశాఖపట్నం: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేనాని అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సమావేశం. విశాఖపట్నం పర్యటన కోసం వచ్చిన ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ కలిశారు. ప్రధానితో శుక్రవారం రాత్రి పవన్ భేటీ అయ్యారు.35 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీలు కలిసి పని చేయడంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీలో పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

ప్రధానితో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీని కలిశానని పవన్ తెలిపారు. ఏపీలోని పరిస్థితులన్నీ ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని పవన్ చెప్పారు.

తనకున్న అవగాహన మేరకు అన్ని విషయాలు చెప్పానన్నారు. ఏపీ ప్రజలు బాగుండాలి, ఏపీ ప్రజలు అభివృద్ధి చెందాలి, తెలుగు ప్రజల ఐక్యత వర్దిల్లాలి అని ప్రధాని మోదీ ఆకాంక్షించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం ఇది అని పవన్ వ్యాఖ్యానించారు. ప్రధానితో భేటీతో ఏపీకి మంచి జరగబోతోందని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీకి మంచి జరగబోతోంది, రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అంటూ.. ప్రధానితో భేటీ తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి. పవన్ కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. పవన్ ఏ ఉద్దేశ్యంతో ఆ కామెంట్స్ చేశారు? ఏపీకి జరగనున్న ఆ మంచి ఏంటి? అనేదాని ఆసక్తికరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com