ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం

- November 23, 2022 , by Maagulf
ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం

న్యూఢిల్లీ: టిడిపి అధినేత చంద్రబాబు కు మరోసారి కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరుకావాల్సిందిగా కేంద్రం కోరింది. డిసెంబర్ 1, 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు జీ-20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. భారత్‌లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చించి.. సలహాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. అలాగే సమావేశ ప్రాధాన్యతను కూడా టిడిపి అధినేతకు ప్రహ్లాద్ జోషి ఫోన్‌లో వివరించి హాజరు కావాల్సిందిగా కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు మరొకసారి చంద్రబాబు డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఇటీవల జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కూడా చంద్రబాబును కేంద్రం ఆహ్వానించింది. ఆ సమావేశంలో ప్రధాని మోడీ.. చంద్రబాబుతో ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చించారు. 2019 ఎన్నికల తర్వాత వీరిద్దరూ కలవడంపై పొలిటికల్‌గా ఆసక్తి రేపింది. ఏయే అంశాలపై చర్చించుకున్నారన్నది దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా మరోసారి ప్రధాని సమావేశానికి చంద్రబాబు హాజరు కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com