యూఏఈలో మసాజ్ కార్డ్ స్కామ్‌లు: పోలీసుల సూచనలు

- November 26, 2022 , by Maagulf
యూఏఈలో మసాజ్ కార్డ్ స్కామ్‌లు: పోలీసుల సూచనలు

యూఏఈ: మసాజ్ కార్డ్ స్కామ్‌లు పట్ల నివాసితులు, పౌరులు జాగ్రత్తగా ఉండాలని యూఏఈ పోలీసులు సూచించారు. మసాజ్ కార్డ్‌లపై ఉండే మహిళల అశ్లీల ఫోటోలను చూసి చాలామంది ఆ రాకెట్‌లో పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. అనంతరం బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారని, నగ్నంగా వారి వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసి వారిని ముఠాలు దోచుకుంటున్నాయన్నారు. ముఠాల ట్రాప్ లలో పడిన వ్యక్తులు అలాంటి సంఘటనను నివేదించడానికి ముందుకు రావడం లేదని, దాంతో అలాంటి ముఠాల ఆగడాలు పెరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.

అబుధాబిలోని రెస్టారెంట్ మేనేజర్ హనీ అలాంటి బాధితుల్లో ఒకరని, తన దుబాయ్ పర్యటనలో తన కారు కిటికీలో పెట్టిన మసాజ్ కార్డ్‌లో నంబర్‌కు డయల్ చేశాడు. ఒక మహిళ కాల్‌కు సమాధానం ఇచ్చింది. లొకేషన్‌ను పంపింది. తను అపార్ట్‌మెంట్‌కి వెళ్లినప్పుడు, ముగ్గురు ఆఫ్రికన్ మహిళలు తనను లోపలికి తీసుకెళ్లారు. మొదట డబ్బు చెల్లించమని అడిగారు. తను నిరాకరించినప్పుడు, తనపై దాడి చేశారు. అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అదేరోజు ముఠాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు.

మసాజ్ కార్డ స్కామ్ ల కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దుబాయ్‌లో ఆరు మిలియన్ల మసాజ్ కార్డ్‌లు స్వాధీనం చేసుకున్నామని, యాడ్స్‌లో కనిపించిన 900కి పైగా కాంటాక్ట్ నంబర్‌లు డిస్‌కనెక్ట్ అయ్యాయని పోలీసులు తెలిపారు. ఎమిరేట్‌తో పాటు షార్జాలో కూడా అనేక ముఠాలను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి నేరాలకు సంబంధించి దుబాయ్‌లో మొత్తం 879 మందిని అరెస్టు చేశారు. వీరిలో 309 మంది మసాజ్ కార్డులను ముద్రించి పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. 588 మంది ప్రజా నైతికతను ఉల్లంఘించారు. షార్జా పోలీసులు ఎమిరేట్‌లో రాకెట్‌ను నడుపుతున్న ముఠాలపై కూడా నిఘా ఉంచారు. తాజాగా, కార్డులు పంపిణీ చేస్తున్న ఐదుగురు ఆసియన్లను అరెస్టు చేశారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి)లోని ఒక ఉన్నత అధికారి మాట్లాడుతూ.. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో మసాజ్ ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com