మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల హాస్పటల్ కు గ్రీన్ సిగ్నల్

- December 01, 2022 , by Maagulf
మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల హాస్పటల్ కు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల హాస్పటల్ తో పాటుదండుమల్కాపూర్‌లో టాయ్‌ పార్క్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మునుగోడును దత్తత తీసుకుంటున్నట్లు ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..ఆ హామీ ప్రకారం మునుగోడు అభివృద్ధి ఫై దృష్టి సారించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై నేడు మంత్రులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రం చండూరు వచ్చిన కేటీఆర్.. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘మునుగోడులో ఆర్‌అండ్‌బీ డిపార్ట్‌మెంట్‌ ద్వారానే రాబోయే ఆరేడు నెలల్లో రూ.100కోట్లతో రహదారుల విస్తరణ చేయబోతున్నాం. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.170కోట్లు వెచ్చించబోతున్నాం. మున్సిపల్‌శాఖ నేతృత్వంలో చండూరు మున్సిపాలిటీకి రూ.30కోట్లు, చౌటుప్పల్‌కు రూ.80కోట్లు కేటాయిస్తున్నాం. ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా రూ.25కోట్లతో రోడ్ల నిర్మాణానికి వెచ్చించబోతున్నం. విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా రూ.8కోట్లతో 33/11 ఐదు సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నం’ అని ప్రకటించారు. దండుమల్కాపూర్‌లో పారిశ్రామిక పార్కును ఆనుకొని ఈ ప్రాంత 10వేల మంది పిల్లలకు ఉపాధి కల్పించేందుకు టాయ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. ఆటవస్తువులు తయారు చేసే కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే భూమిపూజ చేస్తాం అన్నారు. చండూరును త్వరలోనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. మునుగోడులో త్వరలోనే 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com