రేపు సిఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ

- December 12, 2022 , by Maagulf
రేపు సిఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: రేపు సిఎం జగన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్ ఆమోదం కోసం పంపే ప్రతిపాదనలను ఆయా శాఖల అధికారులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా నిర్ధేశించిన విధంగా పంపాలని ఆదేశిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. గత కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతికి సంబంధించిన నివేదికను కూడా సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రగతి పనులు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చ జరిగే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్న సందర్భంగా.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. గతంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 4.72 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు, వారికి పాఠాలు బోధించే 50 వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. అమరావతిలో మొదటిదశ కింద చేపట్టనున్న మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,600 కోట్ల రుణానికి మంత్రివర్గం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్‌ కల్పించేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది.

నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21.30 లక్షల ఇళ్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమ్మ ఒడి ద్వారా డబ్బులు వద్దనుకుంటే గతంలో ల్యాప్‌టాప్‌ తీసుకొనేందుకు ఆప్షన్‌ ఉండేది. ఇప్పుడు ట్యాబ్‌ ఇస్తున్నందున ల్యాప్‌టాప్‌తో పనిలేదు. శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు పరిధి పెంపు. తిరుపతి జిల్లా పేరూరులో నోవాటెల్‌ హోటళ్ల నిర్మాణానికి.. ఒబెరాయ్‌ గ్రూప్‌నకు 30.32 ఎకరాల భూములు మంజూరు. నంద్యాల జిల్లా పాణ్యంలో డిగ్రీ కళాశాల, పాడేరులో గిరిజన విశ్వవిద్యాలయంలో సిబ్బంది పోస్టుల భర్తీకి గతంలో కేబినెట్ పచ్చజెండా ఊపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com