థాయిలాండ్ యుద్ధ నౌక మున‌క‌..31 మంది గల్లంతు

- December 20, 2022 , by Maagulf
థాయిలాండ్ యుద్ధ నౌక మున‌క‌..31 మంది గల్లంతు

బ్యాంకాక్‌: థాయిలాండ్‌కు చెందిన భారీ యుద్ధ నౌక మునిగిపోయిన ఘటనలో 31 మంది గల్లంతయ్యారు. థాయిలాండ్‌లోని ప్రచుప్ ఖిరిఖాన్ ప్రావిన్సులో సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో హెచ్‌టీఎంఎస్ సుఖోథాయ్ నౌక నిన్న సాయంత్రం గస్తీ విధుల్లో పాల్గొంది. అయితే, ఆ సమయంలో ఈదురు గాలులు బలంగా వీయడంతో ఓడ చిగురుటాకులా వణికింది. ఆ సమయంలో నీళ్లు ఓడలోకి చేరడంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. నీటిని బయటకు పంపే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు, సిబ్బంది నౌకపై నియంత్రణ కోల్పోయారు. ఈలోగా నౌకలోకి నీరు మరింతగా పోటెత్తడంతో అది మునిగిపోయింది.

సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న రాయల్ నేవీ బోట్లు, హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నౌకలోని 106 మంది సిబ్బందిలో 75 మందిని రక్షించాయి. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో నౌక పూర్తిగా మునిగిపోయింది. గల్లంతైన 31 మంది కోసం గాలిస్తున్నారు. అందరినీ రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని రాయల్ నేవీ అధికార ప్రతినిధి అడ్మిరల్ పోకరోంగ్ మోంథపలిన్ తెలిపారు. అధికారులు సహా సముద్రంలో ఉన్న సిబ్బంది లైఫ్ జాకెట్లు ధరించి ఉండాల్సిందని అన్నారు. బోట్‌మెన్‌ను రక్షించడమే ఇప్పుడు తమ ముందున్న ప్రధాన విధి అని ఆయన వివరించారు. రక్షించిన వారిలో కొందరిని ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని షెల్టర్‌కు తీసుకెళ్లారు. కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టు అడ్మిరల్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com