ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ..

- January 09, 2023 , by Maagulf
ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ..

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) విస్తరణలో భాగంగా బహిరంగ సభల ఏర్పాటుకు ఆ పార్టీ నాయకత్వం సిద్ధమైంది. తెలంగాణలోనే మొదటి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్రాతిపాదించింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగనుంది. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానించారు.

కేజ్రీవాల్, భగవంత మాన్, అఖిలేష్ యాదవ్ లు అంగీకారం తెలపగా కేరళ సీఎం పినరయి విజయన్ తన నిర్ణయాన్ని ఇవాళ ప్రకటించనున్నారు. ఈ నెల 18న ఖమ్మం కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని వంద ఎకరాల మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు లక్షమందికి పైగా జన సమీకరణ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. బహిరంగ సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. మొదట ఢిల్లీలో బీఆర్ఎస్ సభ నిర్వహించాలని అనుకున్నా.. అనంతరం సభ వేదిక ఖమ్మంకు మారింది. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఖమ్మం ఉంది. ఛత్తీస్ గడ్ లో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com