ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఘననివాళులు

- January 18, 2023 , by Maagulf
ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఘననివాళులు

విశాఖపట్నం: ఆదర్శనీయమైన ప్రజాకేంద్రిత పాలనా సంస్కరణలకు చిరునామాగా నిలిచిన ఎన్టీఆర్ వ్యక్తిత్వం సినిమా, రాజకీయాలకు అతీతంగా ఆదర్శనీయమైనది భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్ థియేటర్ లో లోక్ నాయక్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని వారి స్మృతికి ఘననివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్ ఎంతగానో అభిమానించే విశాఖలో శతజయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లోక్ నాయక్ ఫౌండేషన్ వారికి అభినందనలు తెలియజేశారు.

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వ్రవేశించిన ఎన్టీఆర్ కు ప్రజా సమస్యల పట్ల అవగాహన ఏ మేరకు ఉందనే విషయాన్ని తొలి నాళ్ళ నుంచి పరిశీలిస్తూ వచ్చానన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాజకీయాల మొదలుకుని ప్రభుత్వ పథకాల వరకూ అనేక సంస్కరణలకు నాంది పలికారని తెలిపారు.ప్రత్యామ్నాయ రాజకీయాలకు మార్గదర్శకుడిగా నిలిచి, సంకుచిత వాదానికి అతీతంగా వారు బలంగా వినిపించిన ప్రాంతీయవాద భావన భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలిచిందన్నారు.రామరాజ్యం వంటి వారి నినాదాలు, భారతీయుడిననే ఆత్మవిశ్వాసాన్ని బలంగా వినిపించాయన్న ఆయన, అనేక ప్రాంతీయ పార్టీలకు ఎన్టీఆర్ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.

తరాలుగా వివక్షకు గురౌతున్న వివిధ వర్గాలు, మహిళల కోసం ఎన్టీఆర్ యుద్ధప్రాతిపదికన అనేక పథకాలతో ముందుకు సాగారాన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, రెండు రూపాయలకే కిలో బియ్యం, సగం ధరకే జనతా వస్త్రాలు, వితంతు మహిళలకు, అసంఘటిత రంగాల కార్మికులకు పెన్షన్, రైతులకు 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, సన్న-చిన్నకారు రైతుల భూమిశిస్తు రద్దు, మండల వ్యవస్థ ద్వారా పాలనా వికేంద్రీకరణ, మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా పరిషత్ హైస్కూల్ లు, జూనియర్ కళాశాలల ఏర్పాటు కోసం చొరవ, మధ్యాహ్న భోజన పథకం, క్యాపిటేషన్ ఫీజుల రద్దు, బడుగు-బలహీన-అణగారిన-దళిత వర్గాల సాధికారత కోసం చేపట్టిన పథకాలు, మహిళల సాధికారత కోసం ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు, ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్, అవినీతి రహిత పాలన కోసం చేపట్టిన సంస్కరణలు, మద్యపాన నిషేధం వంటి ఎన్టీఆర్ చేపట్టిన అనేక సంస్కరణలు, పథకాల గురించి ఆయన పేర్కొన్నారు.

ప్రజలే దేవుళ్ళు-సమాజమే దేవాలయం అంటూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎన్టీఆర్ ఇచ్చిన నిర్వచనం ప్రజల గుండెల్లో బలంగా నిలిచిపోయిందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, పరిపాలనలో అడుగడుగున తెలుగు భాషా సంస్కృతులకు పట్టం కట్టడం తననెంతో ఆకట్టుకునేదన్న ఆయన, మాతృభాష-సంస్కృతుల పట్ల తమకు అభిమానం పాళ్ళు ఒకింత ఎక్కువ అని చెప్పుకోవటానికి తామిద్దరం గర్వపడతామని తెలిపారు.సనాత ఆధ్యాత్మిక విశ్వాసాలతో, హైందవ ధర్మానికి ప్రతీకగా కనిపించే ఎన్టీఆర్ ఓ దృఢమైన జాతీయ వాది అన్న ఆయన, వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సినీ, విద్య, సాహిత్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, స్వాతి వార పత్రిక ఎడిటర్ వేమూరి బలరామ్, ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, ప్రముఖ నటీమణులు జయప్రద, జయసుధ, పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మానందం, పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి. సత్యనారాయణ, ఆంధ్రవిశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రసాద్ రెడ్డి, సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్, జి.ఎస్.ఎల్.మెడికల్ కాలేజ్ చైర్మన్ గన్ని భాస్కరరావు, కె.ఎల్.విశ్వవిద్యాలయ చైర్మన్ కోనేరు సత్యనారాయణ, లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యదర్శి ఆచార్య నల్లా బాలయ్య సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు సహా పలువురు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com