'ఎగ్జామ్ వారియర్స్' తెలుగు ప్రతిని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్

- January 24, 2023 , by Maagulf
\'ఎగ్జామ్ వారియర్స్\' తెలుగు ప్రతిని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్

విజయవాడ, జనవరి 24: ప్రధాని విరచిత “ఎగ్జామ్‌ వారియర్స్‌” పుస్తకం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.విద్యార్థుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా రచించిన ఎగ్జామ్‌ వారియర్స్‌ {పరీక్షా యోధులు} తెలుగు అనువాదాన్ని మంగళవారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హరిచందన్‌ మాట్లాడుతూ యోగాశనాలతో సమ్మిళితమైన ఈ పుస్తకం సరదాగా సంభాషించినట్లుగా ఉండటం ప్రత్యేకత అన్నారు.పరీక్షల సమయంలోనే కాక, జీవితంలో ఎదుర్కునే అనేక విషయాలకు ఇది అత్యుత్తమ నేస్తం వంటిదన్నారు. భోధనలా కాకుండా వాస్తవికంగా ఆలోచనలు రేకెత్తించేలా విద్యార్ధులకు ఈ పుస్తకం మార్గదర్శిగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. 

 విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అనేక చిట్కాలను అందిస్తూ ఆచరణాత్మకంగా, ఆలోచనాత్మకంగా ప్రధాని మార్గనిర్దేశం చేశారన్నారు.పరీక్షల పట్ల అతిగా ఆందోళన చెందటం, దానిని జీవన్మరణ సమస్యగా భావించటం అవసరం లేదని మనల్నిమనం విశ్వసిస్తే అన్ని మన దారిలోకి వస్తాయని గవర్నర్ పేర్కొన్నారు.“ఎగ్జామ్ వారియర్స్” పుస్తకం తెలుగుతో సహా 11 భారతీయ భాషలలో ప్రచురించబడిందన్నారు.  'పరీక్షలపై చర్చ-2023' 6వ ఎడిషన్‌లో భాగంగా జనవరి 27న న్యూఢిల్లీలోని తాల్కతోరా ఇండోర్ స్టేడియంలో 38 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నరేంద్ర మోదీ సంభాషించనున్నారన్నారు. దేశవ్యాప్తంగా దృశ్యశ్రవణ మాధ్యమం,వర్చువల్ మోడ్‌లో సైతం లక్షలాది మంది పాల్గొనబోతున్నారు.బోర్డు పరీక్షలు ఎప్పుడూ విద్యార్థుల్లో ఒత్తిడికి కారణమవుతున్న వాస్తవాన్ని గుర్తించిన ప్రధాని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి సంభాషించే ప్రక్రియను ప్రారంభించారని గవర్నర్ అన్నారు. బోర్డు పరీక్షలలో విద్యార్ధులు పనితీరును మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన చిట్కాలను పంచుకోవడం “ఎగ్జామ్ వారియర్స్”  ప్రధాన ఉద్దేశ్యమన్నారు.ఈ కార్యక్రమానికి సిద్ధార్ధ మెడికల్ కళాశాల, కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులుపెద్ద సంఖ్యలో హాజరయ్యారు.కొందరు విద్యార్థులకు గవర్నర్ స్వయంగా పుస్తక ప్రతులను అందజేశారు.

 అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న 1000 మందికి పైగా విద్యార్థులకు రాజ్ భవన్ తరుపున పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (విద్య)  ఎ. సాంబశివ రెడ్డి, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా,  పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్,  పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్, పాఠశాల మోళిక వసతుల కమీషనర్ కాటమనేని భాస్కర్, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి, పాఠశాల మధ్యాహ్న భోజన పధకం సంచాలకురాలు నిధి మీనా, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అచార్య కె. హేమచంద్రారెడ్డి, నాగార్జునా విశ్వవిద్యాలయం ఉపకులపతి అచార్య రాజశేఖర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం అచార్య విష్డు వర్ధన్ రెడ్డి, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉపకులపతి జానకిరామ్, కృష్ణా విశ్వవిద్యాలయం ఇన్ చార్జి ఉపకులపతి రామ్మెహన రావు, ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు,   విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా, సంయిక్త కలెక్టర్ నూపుర్ అజయ్ కుమార్ ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో  ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com