యూఏఈ ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య!

- January 28, 2023 , by Maagulf
యూఏఈ ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య!

యూఏఈ: వరుస వర్షాల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఫ్లూ కేసులు పెరగడం సాధారణమని, అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంఖ్య ఇటీవల పెరిగిందని వైద్యులు తెలిపారు. గత రెండేళ్లలో కొవిడ్-19 కారణంగా ప్రజలు మాస్క్‌లు ధరించి, ఇన్‌ఫెక్షన్‌లను నివారించడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, కానీ ఇటీవల కొవిడ్ ఆంక్షలు సడలింపు కారణంగా ఇటీవల ఫ్లూ కేసులు సంఖ్యలో పెరుగుదల నమోదు అవుతుందని అరేబియా రాంచెస్‌లోని ఆస్టర్ క్లినిక్‌లో స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ వేల్ ఒమర్ అబౌ షెరీఫ్ అన్నారు. అయితే, దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఉష్ణోగ్రతలో గణనీయమైన తగ్గుదలతో  జ్వరం, అంటువ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. దీని కారణంగా పిల్లలు, పెద్దలు ఇద్దరూ ప్రభావితమవుతున్నారని డాక్టర్ షెరీఫ్ చెప్పారు. వర్షం సంబంధిత వ్యాధులతో పిల్లలు, శిశువులు సంక్రమణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తమ క్లినిక్‌లలో ఎక్కువ మంది పిల్లలు, శిశువులు జ్వరం, గొంతు నొప్పి, జలుబు సమస్యలతో చికిత్స కోసం వస్తున్నట్లు డాక్టర్ షెరీఫ్ చెప్పారు. కొందరు ఫ్లూ కేసులు అయితే, మరికొందరు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, పెద్దలదీ అదే పరిస్థితి అని, గత రెండు వారాల్లో సోకిన వారి సంఖ్య పెరిగిందని డాక్టర్ షెరీఫ్ తెలిపారు. క్లినిక్‌లను సందర్శించే పిల్లల్లో దాదాపు 60-80 శాతం మంది వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతున్నారని, మిగిలిన వారు బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. కాగా, ఈ సీజన్‌లో ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి ప్రజలు తీవ్ర ఉష్ణోగ్రతలకు గురికాకుండా జాగ్రత్త వహించాలని, వర్షంలో బయటకు వెళ్లేటప్పుడు రెయిన్ గేర్ ధరించాలని అబుధాబిలోని మీడియర్ హాస్పిటల్‌లోని అంతర్గత వైద్యంలో నిపుణుడు డాక్టర్ ఖలీద్ మమ్‌దూహ్ అల్కుబైసీ తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, వారి ఆరోగ్యాన్ని తనిఖీ చేయాలని, అనారోగ్యంతో ఉంటే పాఠశాలకు పంపవద్దని వైద్యులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com