శ్రీశైలంలో ఫిబ్రవరి 11 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

- February 07, 2023 , by Maagulf
శ్రీశైలంలో ఫిబ్రవరి 11 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం: శ్రీశైలంలో ఈ నెల 11 నుండి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పాదయాత్ర మార్గంలో భక్తుల సేద తీరేందుకు పలుచోట్ల చలువ పందిళ్లను ఏర్పాటు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. ఈసారి పగలంకరణ వీక్షణకు శివస్వాములను 4 వేల మందిని, సాధారణ భక్తులు 4 వేల మందిని అనుమతి ఇస్తామన్నారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులందరికీ 4 ప్రత్యేక క్యూలైన్స్ ద్వారా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లించారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి శివదీక్ష ఇరుముడి భక్తులకు చంద్రావతి కళ్యాణ మండపం నుంచి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. 11 నుండి 21 వరకు బ్రహ్మోత్సవాలలో శీఘ్ర దర్శనం 5 వేల టికెట్లు, అతి శీఘ్ర దర్శనం 2 వేల టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ నెల 15 నుండి 21 వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉందన్నారు.

వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లో కూడా వైద్యం, నీరు, మరుగుదొడ్లు, మైక్ అనౌన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. శివ స్వాములు మాలధారణ తీసి పాతాళ గంగలో వేసి కలుషితం చేస్తున్నారని, ఈసారి అలాంటివి చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

ఇక శ్రీశైలం వెళ్ళే భక్తుల కోసం APSRTC ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించింది. ప్రతి రోజూ 1075 దర్శనం టిక్కెట్లు ఇవ్వనుంది. స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 9 నుండి ఈ విధానం అమల్లోకి రానుంది. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా APSRTC కల్పించింది.
పుణ్య క్షేత్రాలకు అవాంతరం లేని దర్శనానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. దేవాదాయశాఖ సమన్వయంతో ఆర్టీసీ ప్రయాణికులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com