అల్బెర్టా ప్రావిన్స్‌లో కార్చిచ్చు.. నగరం ఖాళీ

- May 04, 2016 , by Maagulf
అల్బెర్టా ప్రావిన్స్‌లో కార్చిచ్చు.. నగరం ఖాళీ

 కెనడాలో కార్చిచ్చు కారణంగా ఓ నగరాన్నంతా అధికారులు ఖాళీ చేయించారు. అల్బెర్టా ప్రావిన్స్‌లో ఈ స్థాయిలో ప్రజలను ఖాళీ చేయించడం ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు. ఫోర్ట్‌ మెక్‌ముర్రే అనే నగరంలో దాదాపు లక్ష మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 30వేల మందిని తరలించారు. నగర సమీపంలోకి కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తున్న సందర్భంగా అత్యవసర సేవల విభాగం అధికారులు నగరాన్నంతా ఖాళీ చేయించాల్సిందిగా ఆదేశించారు.
కోనిఫెరస్‌ అడవులకు పేరొందిన అల్బెర్టా రాష్ట్రంలోని అడవుల్లో మంటలు చెలరేగి విపరీతంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే ఫోర్ట్‌ మెక్‌ముర్రే నగరంలో చాలా ప్రాంతాల్లో ఇళ్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున పొగ, బూడిద ఎగిసిపడుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో ప్రజలను జాగ్రత్తగా ఉండాలని.. సహాయకసిబ్బంది సూచనలను పాటించాలని కోరారు. ఈ నగర సమీపంలో చమురు నిక్షేపాలు ఉన్న కారణంగా మంటలు మరింత ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. పలుచోట్ల గ్యాస్‌స్టేషన్లు పేలిపోయాయి. బలమైన గాలులు వీస్తుండడంతో కార్చిచ్చు తేలిగ్గా వ్యాపిస్తోంది. సహాయ సిబ్బంది మంటలను అదుపు లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com