తెలంగాణకు మరో వందే భారత్‌ రైలు..

- February 28, 2023 , by Maagulf
తెలంగాణకు మరో వందే భారత్‌ రైలు..

న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ వందే భారత్‌ రైళ్లను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలకు ఇప్పటికే ఒక రైలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలు అందిస్తోంది. త్వరలోనే సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య మరో వందే భారత్‌ అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్‌ సేవలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్-పూణె రూట్‌లో వందే భారత్ రైలు ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం సికింద్రాబాద్‌-పుణెల మధ్య ఉన్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును భారతీయ రైల్వే వందే భారత్ రైలుతో రీప్లేస్ చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌-పుణె మార్గంలో రైలు పరుగులు తీయనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వందే భారత్ రైళ్లతో రీప్లేస్ చేసే ఆలోచనలో ఇండియన్‌ రైల్వే ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఏప్రిల్‌ నాటికి ఈ రైలును పట్టాలెక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో సికింద్రాబాద్‌ నుంచి మొత్తం మూడు మార్గాల్లో వందే భారత్‌ పరుగులు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-పుణె మార్గాల్లో వందే భారత్‌ పరుగులు పెట్టనునన్నట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com