ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పవన్‌ కళ్యాణ్

- March 14, 2023 , by Maagulf
ఎప్పటికైనా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పవన్‌ కళ్యాణ్

మచిలీపట్టణం: మాటలు పడ్డా ఓర్పుతో సహించాం.. ఇక చాలు.. ప్రజల అండతో త్వరలోనే జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణలో 30వేల మంది.. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలు జనసేనకు అండగా ఉన్నారని పవన్ వెల్లడించారు. ప్రజలకు అండగా నిలబడాలంటే ధర్మాన్ని నిలబెట్టాలని.. జనసేన పార్టీ దాన్ని నిలబెడుతుందని పవన్ అన్నారు. రాజకీయ అవినీతిపై తిరుగులేని పోరాటం చేస్తామన్నారు పవన్ కల్యాణ్. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

”నాకు రాజకీయాలు తెలియవు. నేను పార్టీ స్ధాపించినప్పుడు అతికొద్ది మంది మాత్రమే నాతో ఉన్నారు. చిన్నప్పటి నుంచి సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించా. ఆ ఆలోచనతోనే పార్టీ పెట్టా. నేను పార్టీ పెట్టడానికి స్ఫూర్తి స్వాతంత్ర్య సమరయోధులు. జాతీయ పతాక రూపశిల్పి ఆఖరి మజిలీలో ఆకలి బాధలతో చనిపోయారన్న వార్త నన్ను కలిచివేసింది.

అసమానతలు, దోపిడీ విధానాలకు ఎదురు తిరగడానికి, పేద వర్గాలకు అండగా నిలబడడానికి జనసేన పార్టీ పెట్టా. ఎంతోమంది పార్టీలు పెట్టారు. నేను ఓడిపోయినా నాకు పార్టీని నడిపే ‌శక్తినిచ్చారు. డబ్బులుండవు. చాలా‌ బాధలుంటాయి. అయినా పార్టీని నడిపాం. దెబ్బ పడేకొద్ది బలపడుతున్నాం. ఒక్కడిగా ప్రారంభించిన జనసేన.. పులివెందులతో సహా ప్రతి చోట కార్యకర్తలను సంపాదించుకున్నాం.

తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను సంపాదించుకున్నాం. మాటలు పడ్డా ఓర్పుతో సహించాం. ఇక చాలు. ప్రజల అండతో త్వరలోనే జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం” అని పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ.వెయ్యి కోట్లు ఆఫర్ చేశారన్న ప్రచారం పై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ”ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నా. పవన్ కు వెయ్యి కోట్లు కాదు రూ.10వేల కోట్లు ఆఫర్ చేశారు అని అనుండాల్సింది. వినడానికి కూడా బాగుండేది. నిజంగా మిమ్మల్ని, మీ ఓట్లను డబ్బుతో కొనగలనా? చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. డబ్బులతో అధికారంలోకి రాగలనా? మీ గుండెల్లో స్థానం సంపాదించగలనా? భావంతో కదా నేను మీకు ఏకం అవుతాను. వెయ్యి కోట్లు ఇచ్చారు. ప్యాకేజీలు తీసుకున్నారు. నేను వేసుకునే చెప్పులు ఫారిన్ బ్రాండ్ కాదు. జనాల్లో ఉండే వ్యక్తి స్వయంగా చేసిన చెప్పులు అవి. మరోసారి నన్ను ప్యాకేజీ స్టార్ అంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చాలా గట్టి చెప్పు దెబ్బ పడుద్ది. డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాను నేను. అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడినే తప్పా.. డబ్బులకు ఆశపడే వాడిని కాను. నాకు డబ్బు అవసరం లేదు. నేను ధైర్యంగా చెబుతున్నా నేను. నేను చేస్తున్న సినిమా.. 22 రోజులు చేస్తున్నా.. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకు రోజుకు రూ.2 కోట్లు. అంటే, 20-25 రోజులు పని చేస్తే దాదాపు రూ.45కోట్లు తీసుకుంటాను. అంటే, ప్రతి సినిమాకు అంత ఇచ్చేస్తారని నేను చెప్పను. కానీ, నా యావరేజ్ స్థాయి అది. మీరిచ్చిన స్థాయి అది. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. నాకు డబ్బుల అవసరం ఏముంది? నాకు డబ్బుపై వ్యామోహం లేదు. నేను డబ్బు సంపాదించుకోలేనా? నేను చూడని సుఖాలు లేవు” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com