మహారాష్ట్రలో 26న జరగనున్న బిఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు

- March 20, 2023 , by Maagulf
మహారాష్ట్రలో 26న జరగనున్న బిఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు

ముంబై: మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న సభను బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాందార్ లోహ సభ సక్సెస్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు కాందార్ లోహలోనే మకాం వేసి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ జనసమీకరణ చేసేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దేశ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న తెలంగాణ మోడల్ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టడం ద్వారా కాందార్ లోహ సభకు భారీ జన సమీకరణ చేయాలనే లక్ష్యంతో పలు గ్రామాలకు 20 ప్రచార రథాలు, 10 ఎల్ఈడీ వీడియో స్ర్కీన్ వాహనాలను సోమవారం జీవన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రచార రథాల ద్వారా తెలంగాణకు సంబంధించి కోటి ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుఏడాదికి ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలు అప్పుపాలు కాకుండా ఆదుకుంటున్న రైతుబంధు పథకం అమలు చేస్తున్నారన్నారు.

ఏ కారణం చేతనైన రైతు మరణిస్తే ఎలాంటి షరతులు లేకుండా 48 గంటల లోపు ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షల చొప్పున అందించే రైతుబీమా పథకం, 24గంటల ఉచిత కరెంట్ తో పంటనష్టం జరగకుండా రైతుముఖంలో సంతోషం చూడడం, ఖరీఫ్, రబీ సీజన్ ఏదైనా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం వంటి రైతు సంక్షేమ పథకాల గురించి ఈ ప్రచార రధాల ద్వారా మహారాష్ట్ర ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు.కాందార్ లోహాసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మోడల్ గురించి మహారాష్ట్ర ప్రజలకు పూస గుచ్చినట్టు వివరిస్తారన్నారు. బిఆర్ఎస్ కాందార్ లోకసభ దేశ రాజకీయాలను మలుపు తిప్పే గొప్ప చరిత్రగా మిగిలిపోతుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బిఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, ప్రవీణ్ పవాడీ, అంకిత్ యాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com