ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు!
- March 26, 2023
హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులను వాడకంలో తెస్తోంది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడపనుంది.
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను సంస్థ ప్రారంభించింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా నామకరణం చేసింది.
హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని విజయవాడ మార్గంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవం జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.
తొలిసారిగా వాడకంలోకి తెస్తోన్న ఏసీ స్లీపర్ బస్సులకు అత్యాధునిక సాంకేతికతను జోడించడం జరిగింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూంనకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ







