క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్‌ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్

- March 28, 2023 , by Maagulf
క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్‌ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్

హైదరాబాద్: క్రిప్టోగ్రఫీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ పేరుతొ వస్తున్న సరికొత్త ఆర్థిక నేరాలపై అప్రమత్తతతో ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పోలీసు కమీషనట్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రాష్ట్రంలో వరుసగా 11వ సారి మొత్తం నేరాల నమోదు అనుమతించదగిన పరిమితి కంటే తక్కువగా ఉండడం, దర్యాప్తులో ఉన్న పోక్సో కేసులను 99% తగ్గించినందుకు తెలంగాణ పోలీసులను డీజీపీ అభినందించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న 74ఆర్‌ఆర్‌కి చెందిన తెలంగాణ కేడర్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌ అధికారులను పోలీస్‌ అధికారులకు పరిచయం చేశారు. క్రిప్టోగ్రఫీ, క్రిప్టో కరెన్సీ వంటి అభివృద్ధి చెందుతున్నబ్లాక్ చైన్ టెక్నాలజీ సాంకేతికతలపై సైబర్ నిపుణుడు రామ్ ప్రసాద్‌తో అవగాహన కార్యక్రమాన్ని ఈ సందర్బంగా నిర్వహించారు.

సైబర్ రంగంలో ఇటీవల క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్, క్రిప్టోగ్రఫీ లపేరుతో నమోదయ్యే సరికొత్త నేరాలు సవాలుగా మారే అవకాశం ఉందని అంజనీ కుమార్ అన్నారు. ఈ నేరాలు జరిగే తీరుపై పూర్తి అవగాహనతోపాటు, వీటిపై కేసులు నమోదు చేయడం తదితర అంశాలపై సైబర్ రంగ నిపుణులు రామ్ ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సైబర్ నేరాలపై 1930 నెంబర్ కు కాల్ చేయడంతోపాటు సంబంధిత వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలనే అంశంపై ప్రజలను చైతన్య పర్చాలని డీజీపీ పోలీస్ అధికారులకు సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సెల్ ఫోన్‌ల చోరీ కేసులు అధికమయ్యాయని,ఈ చోరీ అయిన సెల్ ఫోన్ లను గుర్తించేందుకు గాను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (C.E.I.R) అనే విధానాన్ని ప్రత్యేకంగా ప్రవేశ పెడుతున్నట్టు డీజీపీ వెల్లడించారు.చోరీ అయిన మొబైల్ ఫోన్ నెంబర్లు, ఆయా ఫోన్ల ఐ.ఎం.ఈ.ఐ నెంబర్లు ఈ రిజిస్టర్ లో నమోదు చేసి రాష్ట్రంలో ఎక్కడవున్నా ఆయా ఫోన్ లను వెంటనే బ్లాక్ చేయడంతోపాటు వాటిని గుర్తించేందుకు సులువుగా ఉంటుందని అన్నారు. ఇందుకు గాను ప్రతీ పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్ ను నోడల్ అధికారిగా నియమిస్తామని తెలిపారు. మరో పది రోజుల్లోగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతామని తెలిపారు. ప్రతీ ఎస్.హెచ్.ఓ విధిగా ప్రతి నెలలో నాలుగు సార్లు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో పాల్గొనాలని డీజీపీ మరోసారి స్పష్టంచేసారు. ఈ విధానం సంక్షోభ సమయంలో తోడ్పడుతుందని అన్నారు. శ్రీరామనవమి సందర్బంగా జరిగే శోభాయాత్రల మార్గాలని మున్సిపల్, రోడ్లుభవనాలు తదితర శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల వారీగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్స్ పై సమీక్షిస్తూ, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపే కానిస్టేబుల్ అధికారులను గుర్తించి తగు రివార్డులు అందించాలని తెలిపారు. డీజీపీ కార్యాలయంతో పాటు తమ కార్యాలయాలకుఅందే పిటిషన్లపై తగు చర్యలు చేపట్టాలని కోరారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల దర్యాప్తు పూర్తి చేసి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అడిషనల్ డీజీపీ లు మహేష్ భగవత్, అభిలాష బిస్త్, సంజయ్ కుమార్ జైన్, శ్రీనివాస రెడ్డి, ఐజిలు చంద్ర శేఖర్ రెడ్డి, షానవాజ్ కాసీం, డీఐజీ రమేష్ రెడ్డి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com