80 ఏళ్లు దాటిన వోటర్ల కోసం కర్ణాటకలో కొత్త రూల్

- March 29, 2023 , by Maagulf
80 ఏళ్లు దాటిన వోటర్ల కోసం కర్ణాటకలో కొత్త రూల్

బెంగుళూరు: కర్ణాటకలో ఎన్నికల కమిషన్ సరికొత్త విధానాన్ని అవలంబించబోతుంది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే వోటు వేసేలా ‘వోట్ ఫ్రమ్ హోమ్’ పద్ధతిని ప్రవేశపెట్టబోతుంది. దీని ప్రకారం.. ఇంటి నుంచి పోలింగ్ బూత్‌కు రాలేని, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇకపై ఇంటి నుంచే ఓటేయొచ్చు. దీనిలో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఓటు వేసే అవకాశం ఉంది.

అయితే, దీనికోసం సరికొత్త పద్ధతిని అనుసరిస్తారు. ఈ కొత్త పద్ధతికి సంబంధించిన వివరాల్ని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలో 12.15 లక్షల మంది వృద్ధ ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.55 లక్షల మంది తీవ్ర వృద్ధాప్యం, వైకల్యం, ఇతర కారణాల వల్ల ఇంటి నుంచి బయటకురాలేని పరిస్థితిలో ఉన్నారు. ముందుగా స్థానిక ఎన్నికల అధికారులు వారి ఇళ్లను సందర్శిస్తారు. వాళ్లు ఇంటి నుంచి ఓటు వేస్తారా.. లేక పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేస్తారా అని కనుక్కుంటారు. ఒకవేళ వాళ్లు ఇంటి నుంచి బయటకు రాలేమని, ఇంటి నుంచే ఓటు వేస్తామని చెబితే వారిని గుర్తిస్తారు. అలాంటి వాళ్ల ఇంటికి నిర్ణీత సమయంలో పోస్టల్ బ్యాలెట్లు తీసుకెళ్తారు.

బూత్ లెవల్ ఎన్నికల అధికారులు, ఇతర అధికారులు కలిసి వాళ్ల ఇంటికి వెళ్లి ఓటు వేయించుకుంటారు. ఆ బ్యాలెట్ బాక్సులు లేదా ఈవీఎంలను రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తారు. ఈ ఓటింగ్ ప్రక్రియ నిర్ణీత సమయంలోనే జరుగుతుంది. దీని ద్వారా వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ఇంటింటికీ తిరిగి వారి వివరాలు సేకరిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com