అమరావతి ఆర్ 5 జోన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

- April 04, 2023 , by Maagulf
అమరావతి ఆర్ 5 జోన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

అమరావతి: అమరావతిలోని ఆర్-5జోన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రాజధాని ప్రాంతం వెలుపల ఉన్న పేదలకు ఇంటి నిర్మాణాలకు భూమిని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న జారీ చేసిన జీవోపై హైకోర్టులో వాదనలు జరిగాయి. అమరావతి రైతుల తరపున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాదులు తమ వాదననలు బలంగా వినిపించారు. అయితే, ఈ దశలో ఈ అంశంపై తాము మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయలేమని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఏపీ ప్రభుత్వానికి, సీఆర్డీఏకు నోటీసులు జారీ చేయడమే కాక, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులపై వాదనలు వినేందుకు ఈ నెల 19కి తదుపరి విచారణను వాయిదా వేసింది.

మరోవైపు ఈనాటి విచారణ సందర్భంగా రైతుల తరుపు లాయర్లు వాదిస్తూ… అమరావతి భూములను కేవలం రాజధాని అవసరాలకు మాత్రమే వినియోగించాలని గతంలోనే హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ భూమి పంపకాలకు ప్రభుత్వం జీవో జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పారు. రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం చట్ట విరుద్ధమవుతుందని తెలిపారు. జీవోపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com