బుర్రిపాలెం గ్రామస్తులతో శ్రీమంతుడు
- May 08, 2016
ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు జిల్లా బుర్రిపాలెం వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం వచ్చిన 'శ్రీమంతుడు'కు గ్రామస్తులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు బుర్రిపాలెం. మహేష్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.మహేష్ తన బావ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తో కలసి వచ్చారు. మహేష్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైంది. ఈ రోజు అభివృద్ధి పనులకు మహేష్ శంకుస్థాపన చేయనున్నారు. మహేష్ బాబు రాకకోసం బుర్రిపాలెం గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభివృద్ధికి నోచుకోని తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయన్న ఆశతో ఉన్నారు.
సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం అన్న సందేశాన్ని చాటిన శ్రీమంతుడు సినిమాకు ముందే మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. మార్చిలో మహేష్ భార్య నమ్రత, సోదరి పద్మావతి ఈ గ్రామానికి వచ్చారు. అప్పట్లో నమ్రత ప్రకటించినట్టే రెండు నెలల్లోపే మహేష్ ఈ ఊరికి వచ్చారు.
తన స్వగ్రామమైన బుర్రిపాలెం గ్రామాన్ని సందర్శించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సినీనటుడు మహేశ్‌బాబు అన్నారు. ఇకపై ఈ గ్రామానికి చాలాసార్లు వస్తానన్నారు. శ్రీమంతుడు సినిమా షూటింగ్ సమయంలోనే బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తన బావ, ఎంపీ గల్లా జయదేవ్ తనకు సూచించినట్లు మహేశ్ తెలిపారు. అయితే శ్రీమంతుడు చిత్ర కథ కూడా వూరి దత్తతకు సంబంధించినది కావడంతో ప్రచారం కోసమే ఈ పని చేసినట్లు అనుకుంటారని అప్పుడు వెనక్కి తగ్గినట్లు చెప్పారు.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోనూ ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు మహేశ్ చెప్పారు. బుర్రిపాలెం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడం అంటే రోడ్లు, రంగులు వేయడం మాత్రమే కాదని మహేశ్‌బాబు వ్యాఖ్యానించారు. తెలంగాణలో తాను దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామానికి వచ్చే వారం వెళ్లనున్నట్లు మహేశ్‌బాబు తెలిపారు. తన భార్య నమ్రతా ఇప్పటికే ఆ గ్రామంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించినట్లు చెప్పారు.
జనసంద్రం బుర్రిపాలెం తమ గ్రామానికి వచ్చిన మహేశ్‌బాబును చూసేందుకు బుర్రిపాలెం గ్రామస్థులు ఉత్సాహం చూపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, అభిమానులతో బుర్రిపాలెం పరిసరాలు పోటెత్తాయి. గ్రామంలో తన తండ్రి నివసించిన ఇంటిని మహేశ్‌బాబు సందర్శించి కొద్దిసేపు అక్కడే గడిపారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు.
పైలాన్ ఆవిష్కరణ గ్రామంలో రూ.2.16కోట్లతో చేపట్టబోయే పనుల పైలాన్‌ను మహేశ్‌బాబు ఆవిష్కరించారు. అంతకుముందు నిరుపేదలకు ఇళ్లపట్టాలు అందజేశారు. డ్వాక్రా మహిళలకు రూ.కోటి చెక్కును పంపిణీ చేశారు. దేవరకోట అలయానికి రూ.లక్ష విరాళం ప్రకటించారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద బాలికకు పత్రం అందజేశారు. బుర్రిపాలెం గ్రామ సర్పంచ్‌కు హెల్త్‌కార్డు అందజేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం









