సినిమా రివ్యూ: ‘రావణాసుర’

- April 07, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘రావణాసుర’

‘ధమాకా’ ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలతో వరుస హిట్లు కొట్టి జోరు మీదున్న రవితేజకు ‘రావణాసుర’ హ్యాట్రిక్ హిట్ అవుతుందని భావించారంతా. నెగిటివ్ షేడ్స్‌లో రవితేజ కనిపించడం.. క్రైమ్ థ్రిల్లర్స్‌ని హ్యాండిల్ చేయడంలో తనదైన శైలి ప్రత్యేకత వున్న సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు కావడం ‘రావణాసుర’పై అంచనాలు పెంచేసింది. అయితే, ఆ అంచనాల్ని ‘రావణాసుర’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
రవీంద్ర (రవితేజ), తను ప్రేమించిన అమ్మాయి సీతామహాలక్ష్మి (ఫరియా అబ్ధుల్లా) దగ్గర జూనియర్ లాయర్‌గా వుంటూ కేసులు డీల్ చేస్తుంటాడు. అదే టైమ్‌లో ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడంటూ తన తండ్రిని కాపాడమని హెల్ప్ కోసం వస్తుంది ఆయన కూతురు (మేఘా ఆకాష్). ఆమె తండ్రి ‘సంపత్) ఓ పెద్ద ఫార్మా సిటికల్ కంపెనీ యజమాని. ఆ కేసును కోర్టులో డీల్ చేస్తున్న సమయంలోనే ఏసీపీ (జయరాం) ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ హత్య చేసింది రవీందర్ అనీ, దీంతో పాటూ మరికొన్ని హత్యలు కూడా చేశాడనీ ఏసీపీ కనిపెడతాడు. అసలు రవీందర్ ఇన్ని మర్డర్లు చేయడానికి కారణం ఏంటీ.? మేఘా ఆకాష్ తండ్రిని తాను చేసిన మర్డర్ కేసులో ఎందుకు ఇరికించాడు.? అనేది తెలియాలంటే ట్విస్టులతో కూడిన ‘రావణాసుర’ సినిమాని ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రలో రవితేజ ఇమిడిపోయాడు. రకరకాల వేషాల్లో హత్యలు చేయడం, వాటినుంచి తనదైన బ్రిలియన్స్‌తో తప్పించుకోవడం.. టైటిల్‌కి తగ్గట్లుగా ‘రావణాసురుడి’లాగే కంప్లీట్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించడం.. ఇలా అన్ని కోణాల్లోనూ రవితేజకు ఎలాంటి వంక పెట్టడానికీ లేదు. అయితే, కొన్ని చోట్ల లుక్స్‌లో కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాడు. ఇక, హీరోయిన్ల విషయానికి వస్తే తొంబలా ఈ సినిమాలో చాలా మందే హీరోయిన్లున్నారు. కానీ, వారిలో ఫరియా అబ్ధుల్లాకి ఓ మోస్తరు ప్రాధాన్యత దక్కిందంతే. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేదు. మేఘా ఆకాష్‌ని అంత సరిగ్గా వాడలేదు. మిగిలిన పూజిత పొన్నాడ ఓకే అనిపిస్తుందంతే. హైపర్ ఆది తన పంచ్ డైలాగులతో ఓకే అనిపిస్తాడు. రావు రమేష్ తెలంగాణా యాసతో కూడిన డైలాగులు ఆకట్టుకుంటాయ్. మిగిలిన నటీ నటులు తమదైన పరిధి మేరకు ఫర్వాలేదనిపిస్తారు. 

సాంకేతిక వర్గం పనితీరు:
హీరో రకరకాల వేషాలేసుకుని హత్యలు చేసేస్తుండడం, వాటి నుంచి సింపుల్‌గా తప్పించేసుకోవడం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కానీ, సినిమాటిక్ లిబర్టీలో తీసుకుంటే ఫర్వాలేదనిపిస్తుంది. రెండున్నర గంటల పాటూ సినిమా చూస్తున్నంత సేపూ ఏమీ బోర్ కొట్టదు. మొదట కాస్త నార్మల్‌గా స్టార్ట్ అయిన స్టోరీ, రవితేజలోని నెగిటివ్ యాంగిల్ బయటికొచ్చాకా ఊపందుకుంటుంది. అంత క్రూయల్‌గా రవితేజ పాత్రను చిత్రీకరించడం వెనక చెప్పిన కథ ఒకింత కన్విన్సింగ్‌గా అనిపించినా ఇంకాస్త పట్టు, బిగితనం ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియన్స్. రవితేజలాంటి సీనియర్ హీరోతో ఇంత టఫ్ స్టోరీ టేకప్ చేసినప్పుడు తనకున్న క్రైమ్ థ్రిల్లర్ కథల అనుభవాన్ని దృస్టిలో పెట్టుకుని ఆడియన్స్ అలా ఆశించడం తప్పేమీ అనిపించదు. ఫైనల్‌గా ఆయన గత చిత్రాలతో పోల్చితే ‘రావణాసుర’ బెటర్ అనిపిస్తుంది. 
ఇక, మ్యూజిక్ విషయానికి వస్తే, ఈ సినిమాకి అది పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బలంగా వుండాలి. రీమిక్స్ సాంగ్ కూడా తేలిపోయింది. ఎడిటింగ్ ఓకే. మాటలు ఫర్వాలేదు. కానీ, ఇంకాస్త బలంగా డైలాగ్స్ వుంటే కథనంపై మరింత పట్టున్నట్లు అనిపించేది. నిర్మాణ విలువలు బాగున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్,
నెగిటివ్ షేడ్స్‌లో రవితేజ పర్‌పామెన్స్,

మైనస్ పాయింట్స్:
మ్యూజిక్, లాజిక్ లెస్ క్రైమ్ సన్నివేశాలు

చివరిగా:లాజిక్ పక్కన పెట్టేసి, సినిమాటిక్ లిబర్టీ అని సరిపెట్టుకుంటే, మాస్ మాస్క్ వేసుకున్న ‘రావణాసుర’ జస్ట్ ఓకే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com