ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త...
- April 26, 2023
హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్థికభారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికుల టి-24 టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. అంతేకాదు, కొత్తగా సీనియర్ సిటిజన్లకు టి-24 టికెట్ లో రాయితీ కల్పించాలని నిర్ణయించింది. వారికి రూ.80కే టి-24 టికెట్ అందించనుంది. 60 ఏళ్ళు పైబడిన వారికే టి-24 టికెట్ లో 20 శాతం రాయితీ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డ్ ను బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కొత్త టి-24 టికెట్ ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.
హైదరాబాద్ లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం గతంలో టి-24 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మొదట ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ తర్వాత టి-24ని 100కి తగ్గించింది. ఒక లీటర్ పెట్రోల్ ధర కంటే తక్కువకే 24 గంటల పాటు ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది. తాజాగా సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎండాకాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం టి-24 టికెట్ పై 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని, ఆ టికెట్ ను సీనియర్ సిటిజన్లకు రూ. 80కే అందించాలని నిర్ణయించిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. టి-24 టికెట్ కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయని పేర్కొన్నారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.
మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50 కి ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించచవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని సంస్థ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.
తాజా వార్తలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..









