సింగపూర్ లో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
- May 06, 2023
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో 01-మే-2023 న సింగపూర్ తెలుగు సమాజం వారి మేడే వేడుకలు సింగపూర్ లోని తెరుసన్ రిక్రియేషన్ సెంటర్ లో పాటలు, డాన్స్, మ్యాజిక్, వెంట్రిలాక్విజం, మెంటాలిజం, లేజర్ షో వంటి వివిధ వైవిధ్యభరిత సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత ఘనంగా జరిగాయి.
సుమారు 700 మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాకవి, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత, గాయకుడు, తెలంగాణ శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న హాజరయ్యారు. వెంకన్న తన పాటలతో, చక్కని ఉపన్యాసంతో సభికులనుత్తేజపరుస్తూ అలరించారు. ప్రముఖ జానపద గాయని చైతన్య తనదైన రీతిలో జానపదగీతాలతో అలరించారు. వైవిధ్య కళాకారుడు రవి పిల్లల్ని, పెద్దల్ని తన మాయాజాలంతో అందర్నీ మంత్రముగ్ధులను చేశారు. తరవాత డాన్స్, పాటలు, మరియు ఇతర వినోదభరిత కార్యక్రమాలతో అనేకమంది శ్రామిక సోదరులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం కోసం కార్మిక సోదరుల కోసం 3 వారాంతాల్లో నిర్వహించిన క్రికెట్ , వాలీబాల్ పోటీలు అందరినీ ఏకతాటిపైకి తెచ్చాయి. పోటీల్లో గెలిచిన వారికి గోరెటి వెంకన్న చేతుల మీదుగా బహుమతుల్ని ప్రైజ్ మనీ ని అందించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, మాజీ పార్లమెంట్ సభ్యులు జ్ఞానేంద్రరెడ్డి హాజరయ్యారు. అందరికీ శుభాకాంక్షలు తెలపటం తో పాటు, అందరినీ ఒకతాటి మీదకు తీసుకొచ్చి కార్మికసోదరులకు తెలుగు సమాజం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఏపియన్నార్టి ప్రవాస భీమా గురించి వివరించటంతో పాటు , ప్రభుత్వం అవసరమైనప్పుడు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అలాగే సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో వివిధప్రాంతాలకు విమానసర్వీసులకై తన పరిధిలో కృషిచేస్తానని హామి ఇచ్చారు.
సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, తెలుగులో కార్మిక సోదరుల వృత్తి నైపుణ్య పరీక్షలకై తెలుగు సమాజం కార్యవర్గం చేస్తున్న కృషి ఫలించిందని , తొలిదశలో 5 కోర్సులు ఆమోదం పొందాయని హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. సింగపూర్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి కావటం విశేషం. అలాగే సింగపూర్ లో నివశించే వలస కార్మిక సోదరులను మరియు అనుకోకుండా దురదృష్టవశాత్తు జరిగిన పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని , దీర్ఘకాలపు ప్రయోజనకరంగా , స్ధిరమైన భీమా ప్రణాళిక పై సింగపూర్ తెలుగు సమాజం గత కొంతకాలంగా పనిచేస్తుందని, ఆ ప్రణాళికను భారతదేశ హై కమీషన్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం, వారు కూడా ఈ అకుంఠిత దీక్షకు ఊతమిచ్చే విధం గా ఈ భీమా ప్రయోజకుల పరిధిని పెంచేందుకు వారే చొరవతీసుకుని మరింత ముందుకు తీసుకొని వెళ్ళి ఒకవిధంగా కృతార్థులు అయ్యారని తెలిపారు. ప్రస్తుతానికి కొత్తగా ఇక్కడకు వచ్చేవారు ఈ నూతన భీమా పరిధిలోకి వచ్చేవిధంగా అనుమతులొచ్చినప్పట్టకీ, ఇప్పటికే ఇక్కడ నివశిస్తున్న కార్మిక సోదరులను కూడా ఈ భీమా పరిధిలోకి వచ్చే విధంగా వివిధ శాఖల కు సంబంధించిన అనుమతుల పక్రియ చివరి దశకు వచ్చిందని సింగపూరులో భారత హై కమీషనర్ మహారాజశ్రీ పెరియసామి కుమరన్ ఈ అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం నాడు ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని విజయంతం కావటానికి సహకరించిన అందరికీ , హాజరైనవారికీ, ముఖ్యంగా స్పాన్సర్స్ కు, క్రీడాకారులకు నిర్వాహకులు మేరువ కాశిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయగా సుమారు 3700 మంది వీక్షించారని,
భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం,అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాల్ని తెలుగు సమాజం నిర్వహిస్తుందని, ఈ నూతన కమిటీ గతంలో సాధించిన విజయాల్ని పునాదిగా చేసుకొని మరెన్నో వినూత్న కార్యక్రమాల్ని చేపట్టబోతున్నట్లు గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి తెలిపారు.



తాజా వార్తలు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్
- ట్రైనీ ఐఏఎస్ అధికారులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిశానిర్దేశం
- బహ్రెయిన్ లో డెలివరీ మోటార్ బైక్ల నియంత్రణకు అధ్యయనం..!!
- దుబాయ్ ఫ్లైట్ ఎక్కే గంటల ముందు..కేరళలో దంపతులు అనుమానస్పద మృతి..!!
- ఏప్రిల్లో అబ్షర్ లో 16.5 మిలియన్లకు పైగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు..!!
- జి.వి.శ్రీనివాస్ ను ఘనంగా సత్కారించిన ISC ఒమన్..!!
- వ్యక్తిగత డేటా షేరింగ్ చెక్లిస్ట్ ను ప్రారంభించిన NCSA..!!
- జూన్ 4 నుండి కువైట్ కు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!









