పెన్సిల్‌ రివ్యూ

- May 13, 2016 , by Maagulf
పెన్సిల్‌ రివ్యూ

 చిత్రం పేరు: పెన్సిల్‌ నటీనటులు: జీవీ ప్రకాష్‌కుమార్‌, శ్రీదివ్య, షారిక్‌ హాసన్‌, వీటీవీ గణేష్‌, వూర్వశి, బాలాజీ వేణుగోపాల్‌, రెహమాన్‌ తదితరులు. సంగీతం: జీవి ప్రకాష్‌కుమార్‌ ఛాయాగ్రహణం: గోపీ అమర్‌నాథ్‌ కూర్పు: ఆంటోనీ నిర్మాత: జి.హరి రచన, దర్శకత్వం: మణి నాగరాజ్‌ విడుదల తేదీ: 13-05-2016
ఈ రోజుల్లో చదువు వ్యాపారం అయిపోయింది. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో హంగు, ఆర్బాటాలే తప్ప విద్యార్థుల గురించి .. వాళ్ల భవిష్యత్తు గురించి పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు గొప్ప కాలేజీల్లో చదువుతున్నారన్న భ్రమల్లో ఉంటున్నారు తప్ప నిజంగానే పిల్లలు లక్ష్యం దిశగా సాగుతున్నారా.. లేదా? అన్నది ఆలోచించడం లేదు. ఈ అంశంతో తెరకెక్కిన చిత్రమే 'పెన్సిల్‌'. సంగీత దర్శకుడిగా సుపరిచితుడైన జీవీ ప్రకాష్‌కుమార్‌ కథానాయకుడిగా నటించడం.. తెలుగమ్మాయి శ్రీదివ్య ఇందులో కథానాయిక కావడంతో ఈ చిత్రంపై అసక్తి నెలకొంది. మరి 'పెన్సిల్‌' సినిమా ఎలా ఉందో చూస్తే..
 కథేంటి? శివ (జీవీ ప్రకాష్‌కుమార్‌).. మాయ (శ్రీదివ్య) ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. అదే కాలేజీలో ఓ సూపర్‌ స్టార్‌ కుమారుడు నితిన్‌ (షారిక్‌ హాసన్‌) చదువుతుంటాడు. డబ్బుందన్న అహంకారంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. శివకి శాస్త్రవేత్త కావాలని ఆశ. మాయ డిక్టెటివ్‌ నవలల్ని బాగా చదువుతుంది. శివ.. నితిన్‌లకు క్షణం కూడా పడదు. ఆ కోపంతో శివ రెండేళ్లు కష్టపడి తయారు చేసుకొన్న థీసెస్‌ని నితిన్‌ తగలబెట్టేస్తాడు. దాంతో నితిన్‌పై శివకు కోపం పెరుగుతుంది. అయితే.. ఓరోజు సడన్‌గా నితిన్‌ని ఎవరో హత్య చేస్తారు. ఆ హత్య చేసిందెవరు? ఆ చిక్కుముడి ఎలా వీడింది? ఈ హత్యకూ.. పెన్సిల్‌కీ ఉన్న సంబంధం ఏమిటి? అన్నది ఆసక్తికరం.
ఎలా ఉందంటే? కాలేజీ నేపథ్యంలో సినిమా అంటే ప్రేమ.. యవ్వనం తాలూకూ ఆకర్షణలు వీటిపైనే కథ నడుస్తుందనుకొంటాం. అయితే.. ఓ మర్డర్‌ మిస్టరీ చుట్టూ ఓ కథ అల్లుకొని ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాడు దర్శకుడు. మర్డర్‌ ఎపిసోడ్‌ నుంచి కథ మొదలవుతుంది. కొంతమంది అనుమానితుల్ని చూపిస్తూ వచ్చి.. చివరికి అసలు హంతకుడ్ని తెరపైకి తీసుకొచ్చి షాక్‌కి గురిచేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అదే.. ఈ సినిమాలోనూ కనిపించింది. తొలిభాగం నితిన్‌ దౌర్జన్యాలు.. శివ వన్‌సైడ్‌లవ్‌ చుట్టూ నడుస్తుంది. ద్వితీయార్థంలో హత్య ఎవరు చేశారు? అనే అన్వేషణ సాగుతుంది. కథ ఆసక్తిగా ఉన్నా.. సినిమా అంతా ఒకే పాయింట్‌ చుట్టూ నడవడంతో చూసిన సన్నివేశమే మళ్లీ చూస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. చివర్లో ట్విస్టు కూడా పెద్దగా ఆకట్టుకోదు. వినోదం లేకపోవడం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్‌. సినిమా అంతా సీరియస్‌ టోన్‌లోనే సాగుతుంది. పాటలు బాగున్నా... కథాగమనానికి అడ్డు కలిగిస్తాయి. శ్రీదివ్య తప్ప తెలిసిన నటీలెవరూ లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
ఎవరెలా?సంగీత దర్శకుడిగా ఆకట్టుకొన్న జీవీ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతని నటన ఓకే. అయితే.. సినిమాలో అంతా నితిన్‌ పాత్ర చుట్టే తిరుగుతుంది. సెకండాఫ్‌లో శ్రీదివ్య పాత్ర కీలకం. ఈ సినిమాని ముందుకు నడిపించడానికి జీవీ ఓ టూల్‌గా ఉపయోగపడ్డాడంతే. శ్రీదివ్య క్యూట్‌గా ఉంది. నటన ఫర్వాలేదు. కుర్ర విలన్‌ నితిన్‌ సహజంగా నటించి భయపెట్టాడు. జీవి నటనతో పాటు స్వరాల బాధ్యతా తీసుకున్నాడు. పాటలు బాగున్నాయి. ఆ పాటల్లో కెమెరా పనితనం కూడా ఆకట్టుకొంది. ఓ మంచి పాయింట్‌ చుట్టూ అల్లిన కథే అయినా.. అసలు కంటే కొసరు వ్యవహారం ఎక్కువైంది. మర్డర్‌ మిస్టరీ చుట్టూ అల్లుకొన్న సన్నివేశాలు పట్టు బిగించలేకపోయాయి. దాంతో పట్టు సడలింది.
బలాలు.. + కథా నేపథ్యం + శ్రీదివ్య + సంగీతం
బలహీనతలు - సెకండాఫ్‌ - వినోదం లేకపోవడం
చివరిగా... ఈ 'పెన్సిల్‌'ఇంకాస్త చెక్కాల్సింది. గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com