మన భాషను మనం కాపాడుకోవాలి, ముందు తరాలకు అందించాలి: వెంకయ్య నాయుడు

- August 22, 2023 , by Maagulf
మన భాషను మనం కాపాడుకోవాలి, ముందు తరాలకు అందించాలి: వెంకయ్య నాయుడు

విజయవాడ: నిజమైన భావ వ్యక్తీకరణ, ప్రగతి, మాతృభాష వల్లనే వస్తుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. పరభాషా, సంస్కృతుల వ్యామోహాలలో పడి కొట్టుకుపోవద్దని సూచించారు.నన్నయ భారతం నుంచి 108 పద్యాలతో 2 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో మంగళవారం సామూహికంగా ఆలపించిన ద్వి సహస్ర గళ పదార్చన కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై  ప్రసంగించారు.ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ "జన్మభూమి, కన్నతల్లి, మాతృభూమి, మాతృభాషే మన అస్తిత్వం. ఘనమైన తెలుగుదనాన్ని రాబోవు తరాలకు గొప్ప ఘనచరిత్రగా మనం అందించాలంటే మన భాషను కాపాడుకోవాలి. మన సాహిత్యాన్ని చదవాలి. అందులోని గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటాలి." అని పిలుపునిచ్చారు.

పరభాష, సంస్కృతుల వ్యామోహాలతో తెలుగుకు దూరం అవుతున్న ఈతరానికి తెలుగు పద్య మధురిమలు, తెలుగు భాషా వైభవం ఈ కార్యక్రమం ద్వారా అవగతం అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.  నన్నయ మహాభారతంలోని 108 పద్యాలను నేర్చుకుని కంఠస్తం చేసి, ఇవాళ ఆలపించిన 2 వేల మంది డిగ్రీ విద్యార్థులు, వారికి ఆసక్తిని, అనురక్తిని కల్పించి, అన్ని సౌకర్యాలు కల్పించి పద్యాలు నేర్పించిన నిర్వాహకులు అభినందనీయులన్నారు.
"ఇది ఇక్కడితో ఆగి పోరాదు. మన పద్యాలను పిల్లలకు నేర్పించాలి, అందులోని మాధుర్యాన్ని తెలియజేయాలి. ఇలాంటి కార్యక్రమాలను విరివిగా నిర్వహించి ప్రోత్సహించాలి. ఆ దిశగా ద్విసహస్ర గళార్చన ఓ గొప్ప ప్రారంభంగా భావిస్తున్నాను." అని చెప్పారు.

"తెలుగు పద్యం అంత మనోజ్ఞమైనదీ, మధురమైనదీ, సుందరమైనదీ మరే భాషలో లేదనడం అతిశయోక్తి  కాదు. తెలుగు పద్యం తరతరాలుగా ఎవరూ వీలునామా రాయనవసరం లేకుండానే మనకు సంక్రమించిన పెద్దల ఆస్తి. తెలుగు భాషకే ప్రత్యేకతను, ఔన్నత్యాన్ని తెచ్చిన అద్భుతమైన ప్రక్రియ తెలుగు పద్యం. పద్యాలను కంఠస్తం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. భాషా పరిజ్ఞానం విస్తరిస్తుంది. చిన్ని, చిన్ని పదాలతో గుప్త భావనలు, వ్యక్తీకరణలతో అంతకుమించి అల్పాక్షరాల్లో అనంతార్థాన్ని ఇమడ్చగల సత్తా ఒక్క పద్యానికే ఉంది. " అని చెప్పారు.". ఇక ద్విసహస్రగళ పద్యార్చన కార్యక్రమ నేపథ్యం ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని, శ్రీ మదాంధ్రమహాభారతం అవతరించి దాదాపు వెయ్యేళ్ళు కావడం, రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకం విజయవాడ ప్రాంతంలో వెయ్యేళ్ల క్రితం ఆగస్టు 22వ తేదీన జరిగిందని వెలుగులోకి తేవటం అనే నేపథ్య విషయాలు ఆసక్తిని పెంచుతున్నాయని చెప్పారు. 

" నన్నయ మహాభారతాన్ని ప్రారంభించి ఆది, సభ పర్వాలను... అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాసి ఓ దిశను ప్రకటిస్తే.... అదే మార్గంలో తిక్కన సోమయాజి 15 పర్వాలను రచించి మహాభారతాన్ని పరిపూర్ణం చేశారు. ఇక ఎఱ్ఱనామాత్యులు  నన్నయ వదిలి పెట్టిన అరణ్య పర్వాన్ని పూర్తి చేసి కవిత్రయంలో ఒకరయ్యారు.నేను పుట్టి పెరిగిన నెల్లూరు ప్రాంతంలో తిక్కన ఈ 15 పర్వాలను రచించటం వ్యక్తిగతంగా నాలో ఎంతో ప్రేరణను నింపిన అంశం. నాలో తెలుగు భాష పట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగించిన అంశం కూడా ఇదే. అందుకే ఇలాంటి కార్యక్రమాలను ఎవరైనా నిర్వహిస్తుంటే మనసు ఆనందంతో ఊగిసలాడుతుంది." అని చెప్పారు." 

"సంస్కృత, తెలుగు భాషల్లో పండితుడైన నన్నయ తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ధ చింతామణిని రచించారు. పద్యానికి నన్నయ వ్యాకరణాన్ని రచించగా, గద్యానికి చిన్నయ అంటే పరవస్తు చిన్నయ సూరి వ్యాకరణాన్ని అందించారు. నేటికీ తెలుగు భాషాభిమానులకు, భాషా వేత్తలకు వీరు ఇరువరూ ప్రాతఃస్మరణీయులు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో పరవస్తు చిన్నయ సూరి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఏర్పాటు చేయటం అభినందించదగిన విషయం.బాల వ్యాకరణాన్ని, నీతిచంద్రికను తెలుగు వారికి అందించిన పరవస్తు చిన్నయ సూరి తొలి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అధికార భాషా సంఘాన్ని ఈ వేదిక నుంచి అభినందిస్తున్నాను." అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com