సినిమా రివ్యూ: ‘గాంఢీవధారి అర్జున’

- August 25, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘గాంఢీవధారి అర్జున’

నటీనటులు: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమటం తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్
నిర్మాణం: బీవీఎస్ఎన్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి
దర్శకత్వం, రచన: ప్రవీణ్ సత్తారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ‘ఏజెంట్’ భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ‘గాంఢీవధారి అర్జున’. టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలు బాగున్నాయ్. హాలీవుడ్ రేంజ్ మేకోవర్, యాక్షన్ ఘట్టాలూ, ఏంబియన్స్ సినిమాపై అంచనాల్ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లాయ్. మరి, ఆ అంచనాల్ని ‘గాంఢీవధారి అర్జున’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
మాజీ రా ఏజెంట్ అయిన అర్జున్ (వరుణ్ తేజ్) యూకేలో సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేస్తుంటాడు. మరోవైపు భారత కేంద్ర మంత్రి ఆదిత్యరాజ్ (నాజర్) వాతావరణ సదస్సుకు సంబంధించిన కార్యక్రమం నిమిత్తం యూకే వస్తారు. అక్కడ ఆయనను కలిసి ఓ ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్ ఇవ్వాలనుకుంటుంది శృతి(రోషిణి). ఈ టైమ్‌లోనే ఆయనపై ఎటాక్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆదిత్య రాజ్‌కి అర్జున్ స్పెషల్ సెక్యూరిటీగా ఎంపికవుతాడు. ఆయన పర్సనల్ సెక్యూరిటీగా పని చేస్తుంది ఐరా (సాక్షి వైద్య). ఇంతలోనే ఆదిత్య రాజ్ మనవరాలు కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ చేసింది ఆయన అల్లుడు, పాప తండ్రి అయిన రణ్ వీర్ (వినయ్ రాయ్). సీఎన్‌జీ అధినేత అయిన వినయ్ రాయ్ సొంత కూతురిని కిడ్నాప్ చేయాల్సిన అవసరమేముంది.? ఆదిత్య రాజ్ కూతురు ప్రియ (విమలా రామన్)కి వున్న సమస్య ఏంటీ.? అసలింతకీ ఆదిత్య రాజ్‌ మీద ఎటాక్ చేయించిందెవరు.? ఆ పెన్ డ్రైవ్‌లో ఏముంది.? అర్జున్‌కీ ఐరాకీ మధ్య వున్న వైరం ఏమిటీ.? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ‘గాంఢీవధారి అర్జున’ ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
స్పెషల్ రా ఏజెంట్ ప్రాతలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. ఆయన కటౌట్‌కి తగ్గ పాత్ర ఇది. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు వరుణ్ తేజ్. సాక్షి వైద్యకు ఈ సినిమాలో ఇంపార్టెన్స్ వున్న రోల్ దక్కింది. కథతో పాటూ ఆమె పాత్ర సాగుతుంది. సీనియర్ నటి విమలా రామన్‌కీ స్కోపున్న పాత్రే దక్కింది. విలన్ పాత్రను మొదట్లో సీరియస్‌గా చిత్రీకరించి చివరికొచ్చేసరికి పేలవంగా ఎండ్ చేసినట్లనిపిస్తుంది. కేంద్ర మంత్రి పదవిలో నాజర్ తన అనుభవాన్నంతా రంగరించి నటించారు. ఆ పాత్రకు హుందాతనం తీసుకొచ్చారాయన. అభినవ్ గోమటం, రోషిణి తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
ఆంద్రప్రదేశ్‌లో జరుగుతున్న వాతావరణ కాలుష్యం, మెడికల్ వేస్టేజ్ డంపింగ్ వల్ల మానవాళికి ఎలాంటి ముప్పు వాటిల్లుతోందన్న గ్లోబల్ ఇష్యూని మెయిన్ పాయింట్‌గా తీసుకుని ప్రవీణ్ సత్తారు అల్లుకున్న ఈ కథ బాగుంటుంది. అయితే, దాన్ని స్క్రీన్‌పై అంతే చాకచక్యంగా ప్రెజెంట్ చేయడంలో కాస్త విపలమయినట్లు కనిపిస్తుంది. యాక్షన్, ఎలివేషన్, స్టైలిష్ మేకింగ్ మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాడు ప్రవీణ్ సత్తారు. సో, కథ తేలిపోయినట్లనిపిస్తుంది. ఎడిటింగ్ అక్కడక్కడా కాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ తెరపై చాలా బాగుంటాయ్. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
వరుణ్ తేజ్ భీభత్సమైన మేకోవర్, హాలీవుడ్ సినిమాల్ని తలపించేలా యాక్షన్, అండ్ ఛేజింగ్ సన్నివేశాలు, ప్రవీణ్ సత్తారు ఎంచుకున్న టాపిక్, స్టైలిష్ మేకింగ్.. 

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో కాస్త సాగతీత సన్నివేశాలు.. సన్నివేశాల్లో ఎమోషన్ వున్నప్పటికీ ప్రేక్షకుడికి అది కన్‌వే చేయడంలో కాస్త తడబాటు.. 

చివరిగా:
సినిమాటిక్ లిబర్టీని పక్కన పెట్టేసి, యాక్షన్, ఎలివేషన్ ఇష్టపడేవారికి ‘గాంఢీవధారి అర్జున’ సంతృప్తికరమైన అనుభూతినిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com