చెస్ ఆణిముత్యం రమేశ్‌బాబు ప్రజ్ఞానంద
- August 30, 2023
తమిళనాడు: చెన్నైకి చెందిన 18 ఏళ్ల రమేశ్‌బాబు ప్రజ్ఞానంద అజర్ బైజాన్‌లోని బాకు వేదికగా జరిగిన ప్రపంచకప్ చెస్ రన్నరప్‌గా నిలిచి ఔరా అనిపించుకున్నాడు. ఫైనల్ టై బ్రేక్‌లో టాప్‌సీడ్ కార్ల్సన్ చేతిలో పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రజ్ఞానంద చెస్‌లో రాణించడం ఒక ఎత్తయితే.. తల్లిదండ్రుల ప్రోత్సాహం మరో ఎత్తు. చంద్రయాన్-3 రాకెట్ చంద్రునిపై అడుగిడిన రోజే ప్రజ్ఞానంద పేరూ విశ్వవ్యాప్తమైంది. ప్రజ్ఞానంద ముద్దుపేరు ప్రాగ్. ఆరేళ్లకే అండర్-7 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచి ఆ తర్వాత అండర్-8, అండర్-10 ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలుచుకుం టూ వచ్చాడు. 10ఏళ్ల 9నెలల వయసులో 2016 లో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన అంతర్జా తీయ మాస్టర్(ఐఎం) ఘన తను అందుకున్నాడు. 2018లో 12ఏళ్ల 10నెలల వయసులో రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్ తర్వాత గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించిన రెండో అతి పిన్న వయస్కు డుగా, భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌గా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పాడు. తాజాగా ప్రపంచకప్ చెస్ రన్నరప్‌గా నిలిచి తొలి అతి పిన్న వయస్కుడిగా చెస్ చరిత్రలో సుస్థిర స్థానం లిఖించుకున్నాడు.
తండ్రి రమేశ్‌బాబు పోలియో బాధితుడు కావడంతో తల్లి నాగలక్ష్మి, సోదరి వైశాలి కలిసి ప్రజ్ఞానంద ఆడే ప్రతి టోర్నమెంట్‌కూ తప్పనిసరిగా వెళ్లేవారు. నాగలక్ష్మి పిల్లలకు వంట మనిషిలా సపర్యలు చేస్తుండేది. మరోవైపు తండ్రి రమేశ్ బాబు డబ్బు సమకూర్చేందుకు ఎన్నో కష్టాలను పడాల్సి వచ్చింది. దేశీయ టోర్నీలైతే ఫర్వాలేదు గానీ.. విదేశీ పర్యటనలకు లక్షలాది రూపాయలు ఖర్చయ్యేది. అది తండ్రికి తలకుమించిన భారంగా మారింది. రమేశ్బాబుది ఓ మధ్యతరగతి కుటుంబం. ఒకచేతి సంపాదనే! ప్రజ్ఞానంద పాల్గొనే ప్రతి విదేశీ టోర్నమెంట్లోనూ నాగలక్ష్మి తప్పనిసరిగా వెళ్లాల్సి రావడంతో ఆర్ధికభారం రెట్టింపయ్యాయి.
ప్రపంచకప్ చెస్ పోటీలకు తల్లి నాగలక్ష్మి, సోదరి వైశాలి కూడా వెళ్లారు. రన్నరప్‌గా నిలిచిన కొడుకును ప్రేమగా ఓదారుస్తున్న ఫొటో మరుసటి రోజు మీడియాలో చూసే వరకు ఆమెకు ఈ విషయమే తెలియదు. ప్రాగ్ సాధించిన ఘనత కంటే నాగలక్ష్మి చేసే సేవలపైనే మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆ విషయాలను ప్రజ్ఞానంద సోదరి వైశాలి వివరిస్తూ.. చాలామంది మా అమ్మ గురించి మాట్లాడుకోవడం విని గర్వపడ్డాను. ఎందుకంటే ప్రతి టోర్నమెంట్‌కు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు వెళ్లడం పరిపాటి. కానీ వంట చేసి పిల్లలకు తినిపించడమనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం. ఇక మా నాన్నగారు మేము వెళ్లే ప్రతి టోర్నమెంట్‌కు విమాన టికెట్లు సమకూర్చడం, హోటల్ రూమ్‌లను బుక్ చేయడంలో సాయపడే వారు. దీంతో ప్రాగ్ ఎక్కువగా చెస్‌పై దృష్టి పెట్టడానికి వీలుపడేదని ఆమె చెప్పుకొచ్చింది. మా తల్లిదండ్రులు ఏనాడూ పతకాలు, ట్రోఫీలు సాధించమని ఒత్తిడి చేయలేదని, ఏదో ఒకరోజు తప్పక గెలుస్తారని ప్రోత్సహించేవారని ఆమె తెలిపింది.
ప్రజ్ఞానంద కంటే నాలుగేళ్లు పెద్దదైన సోదరి వైశాలి కూడా చెస్ క్రీడాకారిణే. తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితిని చూసి ఆమె చాలా బాధపడేది. తల్లిదండ్రులకు ఇబ్బంది కలగ కూడదనే ఉద్దేశంతో విదేశీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం తగ్గించింది. కానీ దేశీయ టోర్నమెంట్లలో ప్రతి ఒక్కదాని లోనూ ప్రాతినిధ్యం వహించేది. తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ప్రజ్ఞానంద ఈ సాధించిన విజయమే నిదర్శనం. ఇక ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్ హోదా సాధించాక స్పాన్సర్స్ ముందుకు రావడంతో రమేశ్‌బాబుకు కొంత ఉపశమనం కలిగింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







