కొత్తరూపు సంతరించుకుంటున్న అయోధ్య నగరం
- August 30, 2023
ఉత్తరప్రదేశ్: రామాలయ ప్రారంభోత్సవ వేళ.. అయోధ్య నగరం కొత్తరూపు సంతరించుకుంటోంది. నగరమంతటా ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేలా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క, అయోధ్య రామాలయ పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రామాలయ ప్రారంభోత్సవానికి ఇంకా నాలుగు నెలలే సమయం ఉండడంతో అయోధ్యలో ఎక్కడ చూసినా పనుల సందడే కనిపిస్తోంది.
అయోధ్య రామ మందిరాన్ని మెరుగులు దిద్దే పనులు ముమ్మరం అయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ పునరుద్ధరణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇదే సమయంలో అయోధ్య నగర సుందరీకరణ కూడా పెద్దఎత్తున జరుగుతోంది. వచ్చే జనవరిలో రామాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆరోజు నుంచి సందర్శకులను ఆలయంలోకి అనుమతిస్తారు.
రామాయణ ఘట్టాలు ఉట్టిపడేలా అయోధ్యలో అలంకరణలు జరుగుతున్నాయి. పౌరాణిక చిత్రాలతో గోడల్ని అలంకరిస్తున్నారు. ఇక ఆలయంలోని ప్రతి స్తంభంపైన రాముడి చిత్రాలు ఉండేలా చూస్తున్నారు. ఆలయ ముఖద్వారం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతో పులకిస్తారనే భావన వ్యక్తమవుతోంది. కాంక్రీట్ సీటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, సందర్శకులు ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా.. అన్ని అంశాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయోధ్య అభివృద్ధి మండలిని ఆదేశించింది.
ఆలయానికి కొత్త రూపు ఇచ్చే పనులు గత 15 రోజులుగా ముమ్మరం అయ్యాయి. సందర్శకులు అయోధ్య నగర సాంస్కృతిక వారసత్వంతో మమేకం అయ్యే పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సుమారు 22 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ పనులు చేపట్టారు. అయోధ్య సుందరీకరణ పనులు చాలా కళాత్మకంగా ఉంటాయని, నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో ఇవి కీలకం అంటోంది అయోధ్య అథారిటీ చెబుతోంది.
రామ మందిరంతో పాటు, హనుమాన్‌గర్హి, రాజ్‌ద్వార్, దశరథ్ మహల్, రామ్ గులేల ఆలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలను సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. 8.5 కోట్ల రూపాయలతో ఆలయాల ముఖ ద్వారాలను అలంకరిస్తున్నారు. లక్నో-గోరఖ్‌పూర్ హైవే నుంచి అయోధ్యకు వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా దారిపొడవునా గోడలపైన మొజాయిక్ ఆర్ట్ పెయింటింగ్స్ వేస్తున్నారు. అల్యూమినియం, ఐరన్ స్క్రాప్‌తో తయారు చేసిన బొమ్మల్ని పెడుతున్నారు. టెర్రకోట డిజైన్లను అడుగడుగునా పెడుతున్నారు. పెద్దపెద్ద ఎంట్రన్స్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.
అయోధ్య పరిసర ప్రాంతాల్లోని అన్ని భవనాల ముందు భాగం ఒకే విధమైన డిజైన్, కలర్ థీమ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రికులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నగర కూడళ్లలో LEDలను ఏర్పాటు చేస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లు కూడా ఒకే డిజైన్‌లో ఉండే కాన్సెప్ట్‌ను సిద్ధం చేసింది అయోధ్య ఆథారిటీ. షట్టర్లపై థీమ్ ఆధారిత పెయింటింగ్స్ వేయిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 2,800 దుకాణాలు, వాణిజ్య సంస్థలను గుర్తించారు. గోడలపై పెయింటింగ్స్, పెయింట్ డిజైన్లు, ఎల్ఈడీ ఫిక్చర్లు వంటి చిన్న చిన్న విషయాలను కూడా ఓ ప్రణాళిక ప్రకారం చేపట్టారు. నగర పర్యటనకు వచ్చే సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం 3,500 సీట్లను ఏర్పాటు చేస్తున్నారు.
అయోధ్యలోని ముఖ్యమైన రోడ్లన్నీ ఓపెన్ ఎయిర్ గ్యాలరీలా కనిపించబోతున్నాయి. టూరిస్టులు టెంపుల్ టౌన్లో తిరిగేటప్పుడు సాంస్కృతిక, ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నామనే భావన కలిగేలా ఏర్పాట్లు ఉండబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24వ తేదీల మధ్య రామాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







