తెలంగాణ రాష్ట్రానికి భారీగా అరబ్ పెట్టుబడులు
- September 06, 2023
దుబాయ్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దుబాయ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కేటీఆర్ చేపట్టిన దుబాయ్ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు కేటీఆర్ టీం మంగళవారం రోజు పలు వ్యాపార వాణిజ్య సంస్థ ప్రతినిధి బృందాలతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య అనుకూలతలను వారికి కేటీఆర్ వివరించారు. ఇక్కడి పెట్టుబడుల స్నేహపూర్వక వాతావరణాన్ని గురించి తెలియజెప్పారు. టీఎస్ బీపాస్ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు ముందుకు వచ్చాయి. మంగళవారం(సెప్టెంబర్ 5) నాడు రూ.1,040 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం.
అగ్నిమాపక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా పేరున్న యూఏఈ సంస్థ నాఫ్కో(NAFFCO) తెలంగాణలో రూ. 700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించింది. ఈ మేరకు నాఫ్కో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్.. మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని కేటీఆర్ చేసిన ప్రతిపాదనకు సైతం నాఫ్కో సీఈవో అంగీకరించారు. దాదాపు 100కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కోల్డ్ స్టోరేజ్ వేర్‌హౌస్‌లు ఏర్పాటు చేయనున్న డీపీ వరల్డ్
తెలంగాణ రాష్ట్రంలో రూ. 215 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ డీపీ వరల్డ్ తెలిపింది. డీపీ వరల్డ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ మెహతా, సంస్థ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ డైరెక్టర్ సాలుష్ శాస్త్రి, ఇతర ఉన్నతాధికాకరులు మంగళవారం మంత్రి కేటీఆర్ తో దుబాయి లో భేటీ అయ్యారు. పోర్టు ఆపరేటర్ గా ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్న డీపీ వరల్డ్ హైదరాబాద్ లో తమ ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో ఆపరేషన్ కోసం రూ. 165 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయరంగ ప్రగతికి చేదోడుగా నిలిచే కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ రంగంలో కూడా డీపీ వరల్డ్ పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. మేడ్చల్ ప్రాంతంలో రూ. 50 కోట్లతో 5000 ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌజ్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామన్నారు.
సిరిసిల్లలో లూలూ సంస్థ ఆక్వా క్లస్టర్
దుబాయ్ లో కేటీఆర్ తో లూలూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ సమావేశమయ్యారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో పాటు షాపింగ్ మాల్స్, రిటైల్ రంగంలో తమ సంస్థ కొనసాగిస్తున్న కార్యకలాపాలను మంత్రికి యూసుఫ్ అలీ వివరించారు. సిరిసిల్లలో రానున్న ఆక్వా క్లస్టర్ లో పెట్టుబడులు పెడతామని లూలూ సంస్థ ప్రకటించింది. ఈ ఆక్వా క్లస్టర్ ద్వారా ఏటా రూ. 1000 కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులను సేకరిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.
మలబార్ ఫర్నీచర్ తయారీ ప్లాంట్
బంగారం రిఫైనరీ రంగంలో తెలంగాణలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన మలబార్ గ్రూప్.. తాజాగా రూ.125 కోట్లతో ఫర్నీచర్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. దీని వల్ల వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్‌పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్‌లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!







