కేసీఆర్‌కు కోపమొచ్చింది... ఆ కోపానికి కారణమెవరో తెలుసా ?

- May 19, 2016 , by Maagulf
కేసీఆర్‌కు కోపమొచ్చింది... ఆ కోపానికి కారణమెవరో తెలుసా ?


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సొంత పార్టీ శాసనసభ్యులే ఆగ్రహం తెప్పిస్తున్నారా..? ఆయన వార్నింగ్‌లను లైట్‌ తీసుకుంటున్నారా..? అసలు చంద్రశేఖరుడి కోపానికి కారణాలేంటి..? కేసీఆర్‌ కోపానికి నష్టపోతున్నదెవరు..?
 
'బంగారు తెలంగాణ కోసం నేను తన్లాడుతుంటే.. మధ్యలో వీళ్ల బెదిరింపులేందివయ..! ఇట్లయితే వీళ్లకు మళ్ల పార్టీ టికెట్లు ఇస్తన...ఆ మాత్రం తెలివుండద్దా... ఎమ్మెల్యే అంటే ఏందో అనుకుంటుండ్రు... అయిదేళ్ల దాకా ఏం చేస్తడులే అని పొగరుబట్టిపోతుండ్రు... ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయకుంటే సంగతి తేలుస్తా....' ఇవేవో సాదాసీదా నేత మాట్లాడిన మాటలు కావు.. సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి.... తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కేసీఆర్‌ తన ముఖ్యులతో అన్న మాటలు.. చంద్రశేఖరుడికి ఎందుకింత కోపం వచ్చింది...? ఎందుకీ మాటలు అనాల్సి వచ్చింది...? అసలు కేసీఆర్‌ అంతటి వ్యక్తికి అంతలా ఆగ్రహం తెప్పించిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? అనే కదా మీ డౌటు! ఒకరిద్దరు ఎమ్మెల్యేల పేర్లయితే చెప్పగలం కానీ పదుల సంఖ్యలో ఉంటే ఎలా చెప్పేది?
 
ఒక్కో ఎమ్మెల్యేది ఒక్కో స్టయిల్‌! నా దారి రహదారి అంటూ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా చెలరేగిపోతుంటే అధినేతకు కోపం రాకుండా ఎలా ఉంటుంది..? మొన్నామధ్య ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యేల తీరుపై ఒకింత అసహనాన్ని... మరికాసింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట కేసీఆర్‌! ఒకానొక సందర్భంలో అసెంబ్లీని రద్దు చేస్తా... మళ్లీ ఎన్నికలకు వెళతా అని కూడా అన్నారట! కేసీఆర్‌ వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలకు మైండ్‌బ్లాంకయ్యిందట! తమ చేష్టలతో...తమ వ్యవహారాలతో కేసీఆర్‌కు అంత కోపాన్ని... ప్రభుత్వానికి చెడ్డపేరును తెచ్చిపెడుతున్నారు ఎమ్మెల్యేలు... అవినీతిరహిత పాలన అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది.
 
అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేపై కేసీఆర్‌కు పట్టరానంత కోసం వచ్చిందట! ఆయనపై ఆగ్రహంతో ఊగిపోయారట! టూ పర్సెంట్‌ కమీషన్లు.. గ్రానైట్‌ వ్యాపారులను బెదిరించడం వంటి వాటిపై ఆ ఎమ్మెల్యేను దులిపిపారేశారట! తానే పోలీసులకు పట్టించి అరెస్ట్‌ చేయిస్తానని చీదరించుకున్నారట! ఇంకోసారి నీ ముఖం కూడా నాకు చూపించకు పో అని చీ కొట్టారట! ఇక తాజాగా జరిగిన రెండు సంఘటనపై అయితే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు ముఖ్యమంత్రి.. నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బెదిరింపు ఫోన్‌ సంభాషణ.. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఫోన్‌ సంభాషణ మీడియాలోనూ.. అటు సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ రేపుతున్నాయి..ఎమ్మెల్యేల భాషా పాండిత్యాన్ని విని ఔరా అని ఆశ్చర్యపోతున్నారు జనం.. మరో వారం పది రోజులైతే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతుంది.. పాలన మీద పట్టు పెంచుకోకుండా అనవసరమైన విషయాలలో వేలు పెట్టి.. అటు పార్టీకి.. ఇటు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్‌ తీవ్రమైన కోపంతో ఉన్నారట!
 
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ర్టంలో ప్రతిపక్షాలను పూర్తిగా బలహీనపర్చగలిగారు కేసీఆర్‌.. ఉన్న ఒకరిద్దరు విపక్ష నేతలకు పనే లేకుండా చేయగలిగారు.. తాను ఇంతలా కష్టపడుతుంటే వీళ్లేమో నిద్రపోతున్న ప్రతిపక్షాలను లేపుతున్నారని ఆవేదన చెందుతున్నారు కేసీఆర్‌.. సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని వార్నింగ్‌లు ఇస్తున్నా చెవికి ఎక్కించుకోవడం లేదట సదరు ఎమ్మెల్యేలు.. ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఓ పాతిక మంది ఎమ్మెల్యేల జాబితాను ఇప్పటికే తయారుచేశారట కేసీఆర్‌.. వారితో టచ్‌ మీ నాట్‌లా ఉండాలని సీనియర్‌...జిల్లా మంత్రులకు చెప్పారట! వచ్చే ఎన్నికల్లో వీళ్లకు మళ్లీ టికెట్లు ఇవ్వడం మాట అటుంచితే...వీళ్ల దుశ్చర్యల కారణంగా అనుచరులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు.. ఇది అసలే నామినేటెడ్‌ పోస్టుల కాలం... ఏళ్ల తరబడి చూసిన ఎదురు చూపులకు ఎంతో కొంత ప్రతిఫలం దక్కబోతున్న సమయం.. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేల అనుచరులకు కానీ.. వాళ్లు సిఫారసు చేసిన కార్యకర్తలకు కానీ నామినేటెడ్‌ పదవుల దెబ్బ గట్టిగా తగలబోతున్నది.. ఎమ్మెల్యే వ్యవహారాలు.. దందాల్లో అనుచరుల పాత్ర ఉంటుందని భావిస్తున్న కేసీఆర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి పదవులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారట!
 
మరో మూడేళ్ల దాకా వీళ్లను ఏం చేయలేం కాబట్టి వాళ్ల రాజకీయ కార్యకలాపాలపై ఇన్‌ డైరెక్ట్‌గా వార్నింగ్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట! అందుకే నిధులు కానీ.. నామినేటెడ్‌ పోస్టులు కానీ ఇవ్వకుండా కొంత కట్టడి చేయాలనుకుంటున్నారట! ఈ మధ్య జరిగిన ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్‌ సంభాషణలతో పాటు కరీంనగర్‌.. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేల ఫోన్‌ సంభాషణల ఆడియో టేపులను తెప్పించుకుని మరీ విన్నారట కేసీఆర్‌! ఫోన్‌లో వారు వాడిన భాష...బెదిరింపు తీరుపై ఆగ్రహంగా ఉన్నారట సీఎం...తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల తీరు అయితే మరీ దారుణంగా ఉందట! ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన వ్యాపారాలున్నాయి.
 
కరీంనగర్‌లో గ్రానైట్‌ దందాలు.. నల్లగొండ జిల్లాలో కాలేజీ యాజమాన్యాలను బెదిరించడాలు.. ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో కత. ఇవన్నీ కేసీఆర్‌కు తెలిశాయి.. ఇక రంగారెడ్డి జిల్లాలో ఓ ఎమ్మెల్యేపై వచ్చిన భూదందా వార్తలు సంచలనం సృష్టించాయి.. సదరు ఎమ్మెల్యే ఎవరెవరిని ఎలా బెదిరించింది ఆడియోతో సహా ఉన్నాయి.. ఇలాంటి ఎమ్మెల్యేల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న వాస్తవాన్ని కేసీఆర్‌ తెలుసుకున్నారు.. ప్రజలలో వ్యతిరేకత వస్తే పార్టీ పరిస్థితి...ప్రభుత్వ పరిస్థితి ఏమవుతుందన్న ధ్యాస కూడా లేకపోవడంతో కేసీఆర్‌ ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయాలనుకుంటున్నారట! మాజీ ఉప ముఖ్యమంత్రి వ్యవహారాన్ని కూడా కొందరు ఎమ్మెల్యేలకు గుర్తు చేస్తున్నారట కేసీఆర్‌.. కేసీఆర్‌ వార్నింగ్‌లతో అయినా ఎమ్మెల్యేలు తమ ప్రవర్తన మార్చుకుంటారా..? లేక అలాగే కంటిన్యూ అవుతారా..? చూడాలి మరి!


--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com