బాజిరెడ్డి గోవర్దన్ కి ఆత్మీయ వీడ్కోలు
- October 03, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా పదవీ కాలం పూర్తయిన సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్ కి సంస్థ ఉన్నతాధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. బాజిరెడ్డి గోవర్దన్-వినోద దంపతులను ఘనంగా సన్మానించారు. చైర్మన్ గా రెండేళ్ల తన పదవీ కాలంలో ఆయన సంస్థకు చేసిన సేవలను కొనియాడారు.హైదరాబాద్ లోని బస్ భవన్ లో బాజిరెడ్డి గోవర్దన్ కి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని మంగళవారం టీఎస్ఆర్టీసీ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో సంస్థ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. రెండేళ్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన కాలం జీవితంలో మరిచిపోలేనని చెప్పారు. చిన్నతనం నుంచే ఆర్టీసీతో తనకు అనుబంధముందన్నారు. తాను, ఎండీగా సజ్జనర్ 18 రోజుల వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించామని, ఆ సమయంలో ఎన్నో సవాళ్లు తమకు స్వాగతం పలికాయని గుర్తు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే.. సంస్థ బాగుండాలని, 45 వేల ఉద్యోగులకు భరోసా కల్పించాలని అనునిత్యం తపించామని చెప్పారు. తన పదవీ కాలంలోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషితోనే సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని చెప్పారు. తన విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తో పాటు అధికారులు, ఉద్యోగులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థ సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. తాను రాజకీయ నాయకుడిలా కాకుండా సంస్థతో మమేకమై పనిచేసి.. టీఎస్ఆర్టీసీని ముందుకు నడిపించారని కొనియాడారు. చైర్మన్ గైడెన్స్ పాటు ఉద్యోగులు సమిష్టిగా పనిచేయడం వల్ల సంస్థ వృద్ధి చెందుతోందని, గత రెండేళ్లలో దాదాపు రూ.1600 కోట్ల నష్టాన్ని తగ్గించామని చెప్పడానికి తనకెంతో సంతోషంగా ఉందన్నారు. సంస్థ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటిని పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఫలితంగానే సంస్థలోని ప్రతి ఉద్యోగికి 1వ తేదినే జీతాలను సంస్థ ఇస్తోందన్నారు. రైతు కుటుంబం నుంచి కేబినేట్ ర్యాంకైన టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్ ఎదగడం ఆదర్శనీయమన్నారు. భవిష్యత్ లోనూ మరిన్నీ ఉన్నతస్థానాలను ఆయన అధిరోహించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభిలాషించారు. బాజిరెడ్డి గోవర్దన్ సేవలను స్పూర్తిగా తీసుకుని, ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువచేస్తామని చెప్పారు.
ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, కృష్ణకాంత్, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగరాం, బాజిరెడ్డి గోవర్దన్ కుటుంబ సభ్యులతో పాటు సంస్థ హెచ్వోడీలు, ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









