ఎన్నికలకు పటిష్టమైన భద్రత: సీపీ చౌహాన్

- November 02, 2023 , by Maagulf
ఎన్నికలకు పటిష్టమైన భద్రత: సీపీ చౌహాన్

హైదరాబాద్: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ మాడ్గుల, యాచారం పోలీస్ స్టేషన్ లను సందర్శించడం జరిగింది. అంతే కాకుండా ఇబ్రహీం పట్నం మరియూ మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెక్ పోస్టుల ఏర్పాట్లను కూడా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి తమ వంతు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. రాచకొండ పరిధిలో దాదాపు 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకోవడానికి అవసరమైన చోట్ల మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. ఇప్పటి వరకూ రాచకొండ పరిధిలో జరిపిన తనిఖీల్లో దాదాపు 40 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వివరించారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను సిబ్బందికి అందించామని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద  పరిజ్ఞానాన్ని, అవగాహనను కల్పించడానికి సిబ్బందితో సమావేశాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. 

రాచకొండ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో అసెంబ్లీ ఎన్నికలను ఎటువంటి అవకతవకలు జరగకుండా నిర్వహించడానికి అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా కమిషన్ పేర్కొన్నారు. పాత నేరస్థులను బైండోవర్ చేస్తున్నామని, మాడ్గుల పరిధిలో 90 మంది పైన గత ఎన్నికల సమయంలో పలు రకాల నేరాలకు పాల్పడిన వారిని ముందస్తుగా బైండోవర్ చేసినట్లు తెలిపారు. మాడ్గుల పరిధిలో ఈ ఏడాది జరిగిన ఐదు దొంగతనాల లో 4 కేసుల్ని ఇప్పటికే పరిష్కరించామని , 85 శాతం ఆస్తి రికవరీ చేసినట్టు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com