గూఢచర్యం కేసులో అప్పీల్‌ని అంగీకరించిన ఖతార్ కోర్టు
- November 24, 2023
దోహా: ఖతార్ లో గూఢచర్యం ఆరోపణలతో ఖతార్ కోర్టు 8 మంది ఇండియన్స్ కు మరణ శిక్ష విధించిన విషయం విదితమే. అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో అక్కడి కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. భారత్ అప్పీల్ ను ఖతార్ కోర్టు ఆమోదించింది.
అప్పీల్ పై తాము అధ్యయనం చేస్తున్నామని తదుపరి విచారణ త్వరలో జరుగుతుందని కోర్టు గురువారం పేర్కొంది. గూఢచర్యం కేసులో 2022 ఆగస్టులో నిర్బంధించిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందికి మరణశిక్ష విధిస్తూ ఖతార్ లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు అక్టోబర్‌లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అనంతరం భారత ప్రభుత్వ ఏం చేయబోతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది.
వీరిలో విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ కూడా ఉన్నారు. ఖతార్ తీర్పుతో భారత్ దిగ్భ్రాంతికి గురైందని, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని గతంలో విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
వారిని విడిపించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా బాధిత కుటుంబాలను కలిశారు. ఖతార్ అధికారులతో తాము టచ్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా న్యాయపరంగా కేసును ఎదుర్కునేందుకు అప్పీల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. కేసు సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుని అనవసర వదంతులు సృష్టించవద్దని కోరారు.
వివరాల్లోకి వెళ్తే...భారత్ కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహ్రా సంస్థలో పని చేస్తున్నారు. ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్ కు చెందిన ఓ మాజీ వైమానిక దళాధికారి నిర్వహిస్తున్నారు. భారత్ కు చెందిన 8 మందిని ఖతర్ అధికారులు ఆగస్టు 2022లో బంధించారు. సబ్ మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని బంధించినట్లు అధికారులు తెలిపారు. కస్టడీలో ఉండగానే పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. నిర్బంధాన్ని పొడిగిస్తూ పోయిన కోర్టు.. చివరకు అక్టోబర్ 26న భారత నేవీ మాజీ ఉద్యోగులు-- కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్ మరియు నావికుడు రాగేష్ గోపకుమార్ కు మరణశిక్ష విధించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







