సినిమా రివ్యూ: ‘ఆది కేశవ’

- November 24, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఆది కేశవ’

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ, శ్రీలీల జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆది కేశవ’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించాడు. ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ ఇంతవరకూ కూల్ అండ్ లవ్లీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. కానీ, మాస్ ఇమేజ్ మాత్రం దక్కించుకోలేకపోయాడు ఇంతవరకూ. ఈ సినిమాతో ఆ ఇమేజ్ కోసం ట్రై చేశాడు. ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయ్. కానీ, సినిమా అంచనాల్ని అందుకుందో లేదో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
బాలు (వైష్ణవ్ తేజ్) ఓ సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయ్. చదువు పూర్తి చేసి, ఖాళీగా జాలీగా తిరిగేస్తూ టైమ్ పాస్ చేసేస్తుంటాడు. కానీ, ఒకానొక టైమ్‌లో తల్లి కోరిక మేరకు ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. ఆ క్రమంలో ఫార్మా కంపెనీ సిఈవో అయిన చిత్ర (శ్రీలీల)ను చూస్తాడు. ఆమెని ఇంప్రెస్ చేసి ఆ కంపెనీలో వుద్యోగం పట్టేస్తాడు. చిత్రను ఇంప్రెస్ చేసే క్రమంలోనే ఆమెతో లవ్‌లో పడిపోతాడు. ఓ వైపు ఉద్యోగం మరోవైపు ఏకంగా కంపెనీ సీఈవోతోనే లవ్ ట్రాక్.. ఇలా హ్యాపీగా సాగిపోతున్న బాలు లైఫ్‌లో ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. తనను పెంచుతున్న తల్లితండ్రులు తన సొంత తల్లితండ్రులు కాదని తెలుస్తుంది. సొంతూరు రాయలసీమ అనీ, అసలు పేరు రుద్ర కాలేశ్వర్ అనీ తెలుసుకుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సొంతూరికి వెళ్లి అక్కడ కరడు కట్టిన ఫ్యాక్షనిస్టు అయిన చెంగారెడ్డి (జోజూ జార్జ్)తో తలపడాల్సి వస్తుంది. అసలింతకీ బాలు ఫ్లాష్ బ్యాక్ ఏంటీ.? బాలూకీ, రుద్ర కాళేశ్వర్‌కీ సంబంధం ఏంటీ.? తెలియాలంటే ‘ఆది కేశవ’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
ఇంతవరకూ నాలుగు సినిమాల్లో నటించిన వైష్ణవ్ తేజ్ నటుడిగా భిన్న వేరియేషన్స్ చూపించాడు. కానీ, అతనిలోని పక్కా మాస్ యాక్టర్‌ని బయటికి తీసుకొచ్చిన సినిమా మాత్రం ‘ఆది కేశవ’నే. ఆ క్యారెక్టర్‌లో అక్కడక్కడా కాస్త తడబడ్డాడు. బాలు పాత్ర ఓకే కానీ, రుద్ర కాళేశ్వర్ పాత్ర కాస్త బరువైన పాత్రలా అనిపించింది వైష్ణవ్‌కి.  కానీ, ఓవరాల్‌గా తన బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేశాడు. శ్రీలీల పాత్ర చప్పగా సాగింది. డాన్సులు ఎప్పటిలాగే బాగానే చేసింది. కానీ, జస్ట్ కమర్షియల్ హంగులున్న పాత్ర అంతే. పెద్దగా శ్రీలీలకు సినిమా వున్న పాత్రేమీ కాదు. మలయాళ నటుడు జోజూ జార్జ్ విలన్‌గా ఈ సినిమాకి మరో మెయిన్ అస్సెట్. మలయాళంలో విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి జోజూ జార్జ్‌కి తగ్గ పాత్ర కాదీ చెంగారెడ్డి పాత్ర. ఆయనను సరిగ్గా వాడలేకపోయారు. సుమన్, జయ ప్రకాష్, రాధిక తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
ఫ్యాక్షన్ తరహా సినిమాలు అనేకం వచ్చాయ్. వాటన్నింటికీ డిఫరెంట్‌గా ఈ సినిమాని ఊహిస్తే ఖంగు తిన్నట్లే. చాలా మామూలు ఫక్తు ఫ్యాక్షన్ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి. కొత్త దర్శకుల నుంచి ఇలాంటి ఓ మూస ఫ్యాక్షన్ సినిమా కథని ఎక్స్‌పెక్ట్ చేయలేం. 20 ఏళ్ల క్రిందట వచ్చిన ‘ఆది’, ‘సింహాద్రి’, ‘చెన్న కేశవరెడ్డి’ తదితర ఫ్యాక్షన్ సినిమాలను మళ్లీ తెరపై చూసిన అనుభూతే కలుగుతుంది తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ కొత్తనమేమీ లేదు. కథలు పాతవే అయినా కథనాన్ని నడిపించడంలో డైరెక్టర్స్ తమదైన శైలి ప్రదర్శించి ప్రేక్షకుల్ని మెప్పించాలి. అది కూడా చేయలేదీ సినిమాలో డైరెక్టర్. అయితే, యాక్షన్ ఘట్టాల్లో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. రౌడీల్ని చంపే విధానంలో కొత్త కొత్త పద్ధతులు చూపించాడు. ఆ ఒక్క విషయమే ఈ సినిమాలో కొత్తగా చెప్పుకోదగ్గ అంశం. ప్యాక్షన్ సినిమాలకు ప్రాణం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది. హీరో, హీరోయిన్లకు డాన్స్ చేసేందుకు స్కోప్ ఇచ్చాడంతే. కానీ, ఒక్క పాట కూడా గుర్తుండదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఎడిటింగ్‌లో కత్తెరకు పని ఎక్కువే వుంది.

ప్లస్ పాయింట్స్:
యాక్షన్ ఘట్టాలు, వైష్ణవ్ తేజ్ లుక్స్..

మైనస్ పాయింట్స్:
కొత్తగా లేని కథ, కథనం, బేలగా సాగిన ఫ్యాక్షన్ ఎపిసోడ్, పస లేని హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్...

చివరిగా:
‘ఆదికేశవ’ ఆశించినట్లుగా ఆకట్టుకోలేకపోయావయా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com