నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..

- December 02, 2023 , by Maagulf
నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..

న్యూ ఢిల్లీ: భారత దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో రేపు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు. గతనెల పలు తేదీల్లో తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మిజోరం మినహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. సాయంత్రానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్, ఆ తరువాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఉదయం 10.30 గంటల కల్లా ఆధిక్యం వివరాలు వెల్లడవుతాయి. మరొ నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఫలితాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లోకి ఉంది. రాష్ట్ర, కేంద్ర బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

గురువారం సాయంత్రం తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తికాగానే ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తెలంగాణ, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. చత్తీస్ గడ్ లో హంగ్ వచ్చే అవకాశం ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని పలు ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి. మిజోరంలో స్థానిక పార్టీల ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని సర్వేలు తెలిపారు. అయితే, రేపు మిజోరం ప్రజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున అక్కడి రాజకీయ పార్టీలు, ప్రజల విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ తేదీని ఎల్లుండికి మార్చింది.

తెలంగాణలో ..
తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. 71.34శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 60 స్థానాల్లో గెలిచిన పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకుంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ధీమా ఉన్నాయి. మూడో సారి సీఎంగా కేసీఆర్ ప్రమాణం స్వీకారం చేస్తాడని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో అధికశాతం సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.

ఛత్తీస్‌గఢ్ లో..
ఛత్తీస్‌గఢ్ లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 7, 17 తేదీల్లో పోలింగ్ జరిగింది. మొదటి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు 78శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో 70అసెంబ్లీ స్థానాలకు 75.88శాతం పోలింగ్ నమోదైంది. ఈ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 46 సీట్లలో గెలిచిన పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఇక్కడ 77.15 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 116 స్థానాల్లో గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

రాజస్థాన్ లో..
రాజస్థాన్ లో 199 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. 74.62 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 101 స్థానాల్లో విజయం సాధించిన పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. గడిచిన 30 ఏళ్లలో ఇక్కడి ప్రజలు వరుసగా ప్రభుత్వాలను మారుస్తున్నారు. వరుసగా రెండు దఫాలుగా అధికారంలోకి ఏ పార్టీ రాలేదు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజంచేస్తూ ఈసారికూడా అక్కడి ప్రజలు ఆనవాయితీకి పట్టం కడతారా? ఆనవాయితీకి బ్రేక్ వేస్తారా అనేది రేపు తేలనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com