రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పై తొలగని సందిగ్ధం.. ఢిల్లీకి వసుంధర రాజే

- December 07, 2023 , by Maagulf
రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పై తొలగని సందిగ్ధం.. ఢిల్లీకి వసుంధర రాజే

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు 5 రోజులు కావస్తోంది. బిజెపి ఘన విజయం సాధించిన 3 రాష్ట్రాలలో రాజస్థాన్‌ ఒకటి. అయితే ఈ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. మాజీ సీఎం వసుంధర రాజేతోపాటు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్, ఆ పార్టీ ఎంపీలు బాబా బాలక్‌నాథ్, దియా కుమారి కూడా సీఎం పదవిని ఆశిస్తుండడం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఎడతెగని అనిశ్చితి కొనసాగుతున్న వేళ మాజీ సీఎం వసుంధర రాజే బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మరోసారి సీఎం పదవిని ఆశిస్తున్న ఆమె అధిష్ఠానంతో గురువారం ఉదయం చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. బిజెపి జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు ఆమె అపాయింట్‌మెంట్ కోరారని, గురువారం ఉదయం చర్చించనున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సోమ, మంగళవారాల్లో రాజస్థాన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఎన్నికైన 60 మందికి పైగా బిజెపి ఎమ్మెల్యేలతో వసుంధర రాజే సమావేశమయ్యారు. మర్యాదపూర్వక సమావేశమని చెబుతున్నప్పటికీ వసుంధర రాజేకు ఎమ్మెల్యేలు మద్ధతు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ఆమె ఢిల్లీ బయలుదేరడంతో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. కాగా వసుంధర రాజే 2003 -2008 బిజెపి జాతీయాధ్యక్షురాలిగా, 2013 -2018 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా ఇటీవలే వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి విజయ దుందుభి మోగింది. మొత్తం 199 స్థానాలకు పోలింగ్ జరగగా బిజెపి 163, కాంగ్రెస్ 66 స్థానాలను గెలుచుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com