సినిమా రివ్యూ: ‘ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్’

- December 08, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్’

‘భీష్మ’ సినిమాతో ఘన విజయం అందుకున్న నితిన్.. ఆ తర్వాత సరైన హిట్టు లేక సతమతమవుతున్నాడు. వరుసగా ‘రంగ్ దే’, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలతో ఫ్లాపులు చవి చూశాడు. ఇప్పుడు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’గా విజయం అందుకోవడం కోసం సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో రచయిత నుంచి దర్శకుడిగా ప్రమోట్ అయిన వక్కంతం వంశీకి ఇది రెండో సినిమా. తొలి సినిమాతో పరాజయం పాలయ్యారు. మలి విజయమైనా అందుకున్నాడా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
జూనియర్ ఆర్టిస్ట్ అయిన అభి అలియాస్ అభయ్ (నితిన్) కి చిన్నప్పట్నుంచీ తాను హీరో అనిపించుకోవడం అంటే ఇష్టం. జస్ట్ ఆర్డినరీ మేన్ కాదు.. ఎక్స్‌ట్రార్డినరీ అనిపించుకోవాలనుకుంటాడు. అందుకోసం ఏం చేయాలో అన్నీ చేస్తాడు కానీ యూజ్ వుండదు. షూటింగుల్లో డైరెక్టర్లు అభిని ఎప్పుడూ కెమెరా లెన్స్‌కి వెనకనే వుంచేస్తారు. టాలెంట్ వున్నప్పటికీ గుర్తింపు వుండదు. ఈ క్రమంలోనే ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయిన లిఖిత (శ్రీలీల)తో అభికి పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారి, కంపెనీ బాధ్యతలు తీసుకునే స్థాయికి చేరుతుంది. అదే టైమ్‌లో తన లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అయిన హీరో అవకాశం వస్తుంది. ఓ డైరెక్టర్ చెప్పిన కథ తనకు బాగా నచ్చేయడంతో హీరోగా సైన్ చేస్తాడు. అందుకోసం తను ప్రేమించిన అమ్మాయిని సైతం వదులుకోవల్సి వస్తుంది. ఇంతా చేశాకా, తీరా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైమ్‌కి ఆ డైరెక్టర్ అభికి బదులు మరో వ్యక్తిని హీరోగా సెలెక్ట్ చేసి, సినిమా స్టార్ట్ చేసేస్తాడు. విచిత్రమేంటంటే, తనకు సినిమా కోసం చెప్పిన కథలో మాదిరిగానే నిజ జీవితంలోనూ నటించాల్సిన అవకాశమేర్పడుతుంది. అందుకోసం దొంగ పోలీస్ అవతారమెత్తుతాడు. కథలో చెప్పిన ఏరియాకే వెళ్లి విలన్ నీరో అలియాస్ నిరంజన్ (సుదేవ్ నాయర్)తో తలపడతాడు. ఈ నేపథ్యంలో అతను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులేంటీ.? ఈ క్రమంలోనే ఐజీ విజయ్ చక్రవర్తి (సీనియర్ నటుడు రాజశేఖర్)ని ఎలా ఫేస్ చేశాడు.? లిఖిత ఏమైంది.? దొంగ పోలీస్ అవతారమెత్తిన అభి, తాను కోరుకున్న ఎక్స్‌ట్రార్డినరీ మేన్ ట్యాగ్‌ని దక్కించుకున్నాడా.? తెలియాలంటే సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు:
పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకున్నాడు ఈ సినిమాతో నితిన్. అది ఆయనకు కొత్తేం కాదు. కొట్టిన పిండే. జూనియర్ ఆర్టిస్ట్ అభిగా దొంగ పోలీస్ సైతాన్‌గా రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లోనూ కామెడీ పండించాడు. రావు రమేష్ తండ్రి పాత్రలో యాజ్ యూజ్‌వల్ ఆయన సీనియారిటీ తనదైన పంచ్‌లతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా శ్రీలీల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘ఆది కేశవ్’ సినిమాలో మాదిరి పాత్రనే మళ్లీ పోషించింది ఈ సినిమా కోసం శ్రీలీల. విలన్ పాత్ర పోషించిన సుదేవ్ నాయర్ భీకరమైన లుక్స్‌లో కనిపిస్తూ విలన్ రోల్‌కి తనదైన న్యాయం చేశాడు. ఐజీగా కీలక పాత్ర పోషించిన రాజశేఖర్ పాత్ర చిత్రీకరణ బాగుంది. నితిన్‌కీ, రాజశేఖర్‌కీ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయ్. ఆధ్యంతం ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తాయ్. మిగిలిన పాత్ర ధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
ఒకసారి దర్శకుడిగా ఫెయిలయ్యాడు వక్కంతం వంశీ. రెండోసారి కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌కే పెద్ద పీట వేశాడు. వినోదంపై దృష్టి పెట్టి అసలు కథని పక్కన పడేశాడు. స్ర్కీన్‌ప్లేలోనూ ఫోకస్ కరెక్ట్‌గా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ట్రెండింగ్ అంశాలైన విజయ్ రష్మికల ప్రేమ యవ్వారం, నరేష్ - పవిత్రా లోకేష్ పెళ్లి ముచ్చట, తదితర అంశాల్ని ఓ ఎపిసోడ్‌గా తీసుకుని స్ఫూఫ్ చేసిన విధానం ప్రేక్షకుల్ని సీట్‌లో కూర్చోనివ్వకుండా నవ్వులు పూయిస్తుంది. అలాగే, పోలీస్ స్టేషన్‌లో నితిన్ తన గ్యాంగ్‌తో చేసే రచ్చ ఎపిసోడ్ ఒకింత ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పోలీస్ స్టేషన్ ఎపిసోడ్‌ని తలపిస్తుంది. కానీ, నవ్వులు పూయిస్తుంది. ఎంత చేసినా ఇదంతా రొటీన్ యవ్వారమే అనిపిస్తుంది కానీ, కొత్తగా ఫీలయ్యేంత సినిమా లేదు ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’కి అనే అభిప్రాయం. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు చెప్పాల్సిన పని చాలా వుంది. చాలా సీన్లు నిర్ధాక్షిణ్యంగా లేపేసినా కథకు పెద్దగా ఫరక్ పడే అవకాశం లేదు. కానీ అది చేయకపోవడం సెకండాఫ్ బోరింగ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. హారీస్ జై రాజ్‌కి మ్యూజిక్‌కి చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. కానీ, అంత ఎఫెక్టివ్ మ్యూజిక్ ఈ సినిమాకి అందించడంలో ఆయన కూడా ఫెయిలయ్యారనిపిస్తుంది. ఒకటి రెండు పాటలు మినహా మిగిలిన పాటలు ఏమంత ఎఫెక్టివ్‌గా అనిపించవ్. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
నితిన్ పర్‌ఫామెన్స్, కామెడీ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్.. రాజశేఖర్, నితిన్ మధ్య కొన్ని సన్నివేశాలు మొదలైనవి.

మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ, ఫోకస్ లేని స్ర్కీన్‌ప్లే, వీక్ క్లైమాక్స్..

చివరిగా:
లాజిక్కులు అడక్కుండా ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయాలనుకునేవారికి ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ ఓ రొటీన్ ఎంటర్‌టైనర్ అంతే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com