మహిళా సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు: సీపీ సుధీర్ బాబు

- December 13, 2023 , by Maagulf
మహిళా సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు: సీపీ సుధీర్ బాబు

 

హైదరాబాద్: సుధీర్ బాబు రాచకొండ కమిషనరేట్ నూతన కమిషనర్ గా ఈ రోజు నేరేడ్మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది కమిషనర్ గారికి పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా రాచకొండలో పని చేస్తున్న డీసీపీ, ఏసీపీ మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. తన సమర్థత మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి కి ధన్యవాదములు తెలిపారు. రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా మరియు నేర నియంత్రణలో సీసీటీవీ కెమెరాల వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామని, త్వరిత గతిన నేరనిరూపణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సివిల్, ఏఆర్, బెటాలియన్, ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలను సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 

గతంలో రాచకొండ అదనపు కమిషనర్ గా పని చేసిన అనుభవంతో రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాల మీద సంపూర్ణ అవగాహన ఉందని, మూడు కమిషనరేట్లతో సమన్వయంతో కలిసి పనిచేస్తామని, ప్రజలకు ఎల్లవేళలా సేవలందిస్తామని, ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని, పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు.  భూ సంబంధ నేరాలపై ప్రత్యేక ద్రుష్టి సారిస్తామని, రౌడీ షీటర్స్ పై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో అవసరం అయితే రిటైర్డ్  అయిన పోలీస్ అధికారుల సలహాలు కూడా తీసుకుంటామని, నిబద్దత తో పనిచేస్తున్న అధికారులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రజలు నేర భయం లేకుండా ఉండాలంటే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నేరాలను అదుపు చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాచకొండ Addl సీపీ తరుణ్ జోషి,  మల్కాజ్గిరి డిసిపి ధరావత్ జానకి, మహేశ్వరం డిసిపి శ్రీనివాస్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, ఉమెన్ సేఫ్టీ డిసిపి ఉషా విశ్వనాథన్, రోడ్ సేఫ్టీ డిసిపి శ్రిబాల, డీసీపీ క్రైమ్స్ అరవింద్, డీసీపీ అడ్మిన్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com