ఈ నెల 23 నుంచి వైకుంఠద్వార దర్శనం..

- December 18, 2023 , by Maagulf
ఈ నెల 23 నుంచి వైకుంఠద్వార దర్శనం..

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠద్వార దర్శనం చేసుకోవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ పది రోజుల్లో ఏ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నా శ్రీవారి భక్తులకు ఒకే రకమైన పుణ్యఫలం లభిస్తుందని చెప్పారు.

ఈ పది రోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ప్రొటోకాల్ పరిధిలోని వారు స్వయంగా వచ్చినప్పటికీ వారికి మాత్రమే టిక్కెట్లు జారీ చేస్తామని వివరించారు. తిరుమలలో వసతి సౌకర్యం పరిమితంగా ఉందని, శ్రీవారి భక్తులు తిరుపతిలోనే వసతి సౌకర్యం పొందాలని ఆయన సూచనలు చేశారు.

సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు పది రోజులుకు సంబంధించిన 4.25 లక్షల టోకెన్లను ఈ నెల 22 నుంచి తిరుపతిలో జారీ చేస్తామని ధర్మారెడ్డి వివరించారు. వారు 24 గంటల ముందుగా మాత్రమే తిరుమలకు రావాలని చెప్పారు.

దర్శన టోకెన్ తీసుకున్న భక్తులకు మాత్రమే తిరుమలలో వసతి సౌకర్యం కల్పిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. ఒకవేళ టోకెన్ లేని భక్తులు తిరుమలకు వచ్చినా వారికి వసతి, దర్శన సౌకర్యం లభించదని అన్నారు. ఈ నెల 23న ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com