మూవీ రివ్యూ: ‘సలార్’

- December 22, 2023 , by Maagulf
మూవీ రివ్యూ: ‘సలార్’

ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో వుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ మధ్య ప్రబాస్ నుంచి వస్తున్న సినిమాలన్నీ కేవలం అంచనాలకే పరిమితమవుతున్నాయ్ తప్ప, అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నాయ్. ఈ నేపథ్యంలో ‘సలార్’పై అంచనాలున్నప్పటికీ చిత్ర యూనిట్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిందని చెప్పొచ్చేమో. గత సినిమాల మాదిరి ప్రమోషన్లు ఊదరగొట్టలేదు. ఫ్యాన్స్‌ నుంచి కూడా సరైన సందడి, హంగామా లేదు. అయితే, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రబాస్ కాంబో మూవీ అంటే ఖచ్చితంగా అద్భుతమే.! మరి, ఆ అద్భుతాన్ని ‘సలార్’ సృష్టించిందా.? ప్రబాస్‌కి ఈ సినిమా కమ్ బ్యాక్ మూవీ అవుతుందా.? ‘బాహుబలి’ రేంజ్ రికార్డులు కొల్లగొట్టబోతోందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
దేవ రధ అలియాస్ దేవ (ప్రబాస్), వరద రాజమన్నార్ (పృద్వీ రాజ్ సుకుమారన్) చిన్ననాటి స్నేహం నుంచి కథ మొదలవుతుంది. ఆ తర్వాత విదేశాల నుంచి ఇండియాకి తిరిగొచ్చిన ఆధ్య (శృతిహాసన్)వైపుకి కథ మళ్లుతుంది. ఆధ్యని కిడ్నాప్ చేసి చంపడానికి కొందరు కొందరు గూండాలు ప్రయత్నం చేస్తారు. వారి నుంచి ఆధ్యని కాపాడేది ఒకే ఒక్కడనీ, వాడే దేవ అని గుర్తించిన ఆధ్య తండ్రి దేవని కాపలాగా వుంచుతాడు. బొగ్గు గనుల్లో పని చేసే దేవ తల్లి ఈశ్వరీ రావు. హింస అంటేనే భయపడే ఈశ్వరీ రావు తన కొడుకు బర్త్‌డే కేక్ కట్ చేయడానికి ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటేనే భయపడుతుంటుంది. అలాంటిది కత్తులు, గన్నులు పట్టి శత్రువులను చీల్చి చెండాడేంత అవసరం దేవకి ఎందుకొచ్చింది.? కాన్సూర్ అధినేత వరద రాజ మన్నార్ (జగపతిబాబు)తో పోరుకు ఎందుకు తలబడతాడు.? కుర్చీ కోసం సాగే పోరాటంలో స్నేహితుడికి కుర్చీ దక్కేలా చేస్తాడా.? లేదంటే, తానే ఆ కుర్చీకి అధిపతినిని తెలుసుకుని తానే దక్కించుకుంటాడా.? చివరికి ఆధ్యని ఎలా కాపాడాడు.? కుర్చీ కోసం జరిగిన రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు జరిగాయ్.? ఇలాంటి చాలా ప్రశ్నల్లో కొన్నింటికి  సమాధానాలు దొరకాలంటే ‘సలార్’ మొదటి పార్ట్ ధియేటర్లో చూడాల్సిందే. అయితే, అన్ని ప్రశ్నలకూ సమాధానం దొరకాలంటే రెండో పార్ట్ వరకూ వెయిట్ చేయక తప్పదు. ఈ పార్ట్‌లో చాలా ప్రశ్నలు సస్పెన్స్‌గా మిగిల్చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

నటీనటుల పనితీరు:
కటౌట్ వున్నోడికి కంటెంట్‌తో పని లేదు.. అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రబాస్. కానీ, ఈ మధ్య ప్రబాస్‌ని ఆయన కటౌట్ కూడా కాపాడలేకపోతోంది. దాంతో, ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. ప్రబాస్‌ని వరుసగా డిజాస్టర్లు వెంటాడుతున్నాయ్. కానీ, ‘సలార్’ సినిమా విషయానికి వచ్చేసరికి ప్రబాస్ తన కటౌట్‌తోనే ఫ్యాన్స్‌ని పడగొట్టేశాడు మళ్లీ. స్ర్కీన్ మొత్తం తనదైన కటౌట్‌తో రిచ్‌నెస్ నింపేశాడు. ఎలివేషన్ సీన్స్‌లో ఫ్యాన్స్‌కే కాదు, సగటు సినీ ప్రేక్షకుడికి సైతం గూస్ బంప్స్ తెప్పించాడు. యాక్షన్ సీన్లలో సూపర్బ్ అనిపించాడు. ప్రబాస్ తర్వాతి స్థానం ఈ సినిమాలో కీలక పాత్రధారుడైన మలయాళ నటుడు ప్రృద్వీ రాజ్ సుకుమారన్ దక్కించుకున్నాడు. సమవుజ్జీగా ప్రబాస్‌తో హోరా హోరీ పర్‌ఫామెన్స్ ఇచ్చాడు పృద్వీరాజ్. హీరోయిన్ శృతి హాసన్ పాత్ర పెద్దగా పండలేదు. కానీ, ఏదో వున్నంత వరకూ ఓకే అనిపించింది. కాన్సార్ పెద్దగా తనదైన అనుభవాన్ని రంగరించి నటించాడు జగపతిబాబు. ప్రబాస్ తల్లి పాత్రలో ఈశ్వరీ రావు నటన బాగుంది. మిగిలిన పాత్రధారులు మైమ్ గోపి, బాబీ సింహా, ఝాన్సీ, శ్రేయారెడ్డి, బ్రహ్మాజీ, టినూ ఆనంద్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
మరోసారి ప్రశాంత్ నీల్ తనదైన మేకింగ్ స్టైల్ చూపించాడు ‘సలార్’ సినిమాతో. అయితే, కథ, కథనాలు బలంగా రాసుకుని వుంటే బాగుండేది.. అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. రెండు యాక్షన్ బ్లాక్స్ సినిమాకి హైలైట్‌గా చిత్రీకరించాడు. ఈ రెండు ఎపిసోడ్లు చాలు టికెట్ పైసా వసూల్ అనేట్టు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే, ‘కేజీఎఫ్’లో బలమైన కథ, కథనం రాసుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. అది సుస్పష్టంగా కనిపిస్తుంది తెరమీద. అంతేకాదు, రెండు భాగాలుగా ఈ సినిమా వుండబోతోందని ముందే చెప్పేశారు. మొదటి పార్ట్‌లో చాలా చాలా సస్పెన్స్‌లు వదిలేశారు రెండో పార్ట్ కోసం. ఫస్టాఫ్ సాదా సీదాగా రెగ్యులర్ స్టోరీగా అనిపించిన కథ, సెకండాఫ్ ‌కొచ్చేసరికి కాస్త పుంజుకుంటుంది. కానీ, అప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. కానీ, ప్రబాస్ ఎలివేషన్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఫ్యాన్స్ అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఫుల్ ఖుషీ అవుతాఇంత భారీ బడ్జెట్ సినిమాలకు ప్రాణం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అది ‘సలార్’కి బాగానే వర్కవుట్ అయ్యింది కానీ, పాటలు మాత్రం అస్సలు చెప్పుకోదగ్గవి కావు. ఎడిటింగ్‌లో ఇంకాస్త క్రిస్పీనెస్ వాడి వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. విజువల్స్ ఐఫీస్ట్ అనేలా వుంటాయ్. కలర్ షేడ్స్ కాస్త అక్కడక్కడా కేజీఎఫ్‌ని తలపిస్తాయ్. బట్ ఓకే. నిర్మాణ విలువలు అద్భుతంగా వున్నాయ్. ఓవరాల్‌గా ప్రశాంత్ నీల్ మార్క్ విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:
ప్రబాస్ కటౌట్, ఎలివేషన్ సీన్లు, ఇంటర్వెల్ బ్లాక్, కోల్ మైన్స్‌లో యాక్షన్ ఎపిసోడ్, నారంగి ఎపిసోడ్, ప్రబాస్, పృద్వీరాజ్ మధ్య వచ్చే పవర్ ‌ఫుల్ సన్నివేశాలు..

మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ, కథనం, డల్‌గా, కన్‌ఫ్యూజింగ్‌గా సాగిన ఫస్టాఫ్, అవసరం వున్నప్పటికీ యూజ్ చేయని హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్, స్కోపున్నా పట్టించుకోని ఫన్ సీన్లు..

చివరిగా:
చాలా కాలం తర్వాత ప్రబాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే సినిమా ‘సలార్’. చాలా చోట్ల చాలా రకాల లోపాలున్నప్పటికీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com