సినిమా రివ్యూ: ‘గుంటూరు కారం’

- January 12, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘గుంటూరు కారం’

సంక్రాంతి సీజన్‌లో ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే వచ్చే ఆ కిక్కే వేరప్పా. అదే కిక్కుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘గుంటూరు కారం’. పండగ రెండు రోజుల ముందే రిలీజై, అసలు సిసలు పండగ తెస్తుందని అంచనాలు వేసిన సినిమా ఇది. మరి, ఆ అంచనాల్ని ‘గుంటూరు కారం’ అందుకుందా.? సంక్రాంతికి అసలు సిసలు కిక్కిచ్చే సినిమా అనిపించుకుంటుందా.? అంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
వసుంధర (రమ్యకృష్ణ), రాయల్ సత్యం (జయరామ్) దంపతుల కుమారుడు వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేష్ బాబు). చిన్నతనంలోనే తల్లి తండ్రులిద్దరూ విడిపోవడంతో మేనత్త బుజ్జి (ఈశ్వరీ రావు) దగ్గర గుంటూరులో పెరుగుతుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తల్లి వసుంధర రెండో పెళ్లి చేసుకుని తెలంగాణా రాష్ట్రానికి న్యాయ శాఖా మంత్రి అవుతుంది. ఈ క్రమంలో తన రెండో కుమారుడ్ని రాజకీయ వారసుడిగా ప్రకటించే నేపథ్యంలో మొదటి కొడుకు, భర్త నుంచి రాజకీయంగా ఎలాంటి అడ్డంకుల్లేకుండా చూడాలనుకుంటాడు వసుంధర తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాష్ రాజ్). ఈ క్రమంలోనే రమణతో ఓ అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటాడు. మరి, ఆ అగ్రిమెంట్‌కి రమణ ఒప్పుకున్నాడా.? అసలింతకీ ఆ అగ్రిమెంట్‌లో ఏం రాసుంది.? తెలియాలంటే ‘గుంటూరు కారం’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
మహేష్ బాబుకి మాస్ రోల్స్ పెద్దగా పడవు.. అనేది అందరికీ తెలిసిన సత్యమే. కానీ, మరోసారి ‘గుంటూరు కారం’ కోసం ట్రై చేశాడు. ఓకే.! తనవరకూ తాను ప్రయత్నించాడు. మాస్ లుక్స్‌లో కనిపించి మెప్పించాడు. ఇంతవరకూ చేయని విధంగానే డాన్సులేసి కూడా ఫ్యాన్స్‌ని హుషారెత్తించాడు. అయితే, ఫ్యాన్స్‌కి అదొక్కటే చాలదుగా. ఇక, హీరోయిన్లలో శ్రీలీల విషయానికి వస్తే.. యాజ్ యూజ్‌వల్ డాన్సింగ్ డాల్‌గానే వాడారు. డాన్సుల్లో మళ్లీ తన సత్తా చాటింది శ్రీలీల. యాక్టింగ్‌కి పెద్దగా స్కోపున్న రోలేమీ కాదు ఎప్పటిలాగే. మరో ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి పాత్ర చాలా పరిమితంగా అస్సలు ఇంపార్టెన్స్ లేకుండా వచ్చి పోతుంది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రావు రమేష్ వంటి సీనియర్ నటులు తమకు కొట్టిన పిండిలాంటి పాత్రల్లోనే నటించారు. పెద్దగా కొత్తదనమేమీ లేదు. సునీల్ తదితర పాత్రలు అలా వచ్చి పోతాయంతే. వెన్నెల కిషోర్ పాత్ర కూడా అంతే. ఈశ్వరీ రావు పాత్ర కాస్త బలంగా అనిపించినప్పటికీ ఓవర్ డోస్ అనిపిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
త్రివిక్రమ్ సినిమాల్లో పెద్దగా కథ కోసం ఆలోచించకూడదు. అన్ని కథలూ ఒకేలా వుంటాయ్ ఇంచుమించుగా. కానీ, కథనం నడిపే తీరులోనే గురూజీ ఏదో మ్యాజిక్ చేస్తుంటారు. ఆ మ్యాజిక్కే ‘గుంటూరు కారం’లోనూ వుండి వుంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం నిరాశ తప్పదు. గురూజీ డైరెక్షన్ స్టైల్ ఏమాత్రం కొత్తగా అనిపించదు. మ్యాజిక్ అస్సలు లేదు. తల్లీ కొడుకుల బంధం ఓ సంతకంతో తెగిపోతుందా.? అనే ఓ బలమైన పాయింట్‌ని ఈ కథలో చెప్పే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ, ఆ ప్రయత్నంలో ఎలాంటి బలం కనిపించదు. ఎక్కడా హృద్యంగా అనిపించదు. పాత్రలకీ, తెరపై జరుగుతున్న సన్నివేశాలకీ ఎలాంటి సంబంధం లేకుండా కథనం నడిచిపోతుంటుంది. త్రివిక్రమ్ డైలాగులకి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంటుంది. డైలాగుల్లో ఆ మార్కు కూడా ఎక్కడా కనిపించకపోవడం ‘గుంటూరు కారం’ వంటి భారీ అంచనాలున్న సినిమాకి దురదృష్టమనే చెప్పాలి. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగా వున్నాయ్. థమన్ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఎడిటింగ్‌లో చాలానే కత్తెరలు పడాలి. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ ఓకే. కానీ, డైరెక్షన్‌లోనే చాలా లోపాలు వెతుకుతున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. గురూజీ మార్క్ సినిమా అస్సలు కానే కాదు.

ప్లస్ పాయింట్స్:
మహేష్ పర్‌ఫామెన్స్, డాన్సులు.. శ్రీలీల గ్లామర్, డాన్సులు.

మైనస్ పాయింట్స్:
పట్టు లేని కథ, కథతో సంబంధం లేకుండా సాగే కథనం.. కథకి కీలకమైన అంశాన్ని సింపుల్‌గా పక్కదారి పట్టించేయడం.. ఎక్సట్రా..

చివరిగా:
‘గుంటూరు కారం’ పేరులోనే ఘాటు.. సినిమాకి సత్తా లేదు.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com