సినిమా రివ్యూ: ‘హనుమ్యాన్’

- January 12, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘హనుమ్యాన్’

చిన్న సినిమా చిన్న సినిమా అంటూ ఈ సంక్రాంతి సినిమాల్లో పెద్ద సినిమాలకు ధీటుగా పోటీకి దిగింది ‘హనుమ్యాన్’. పెద్ద సినిమాల తాకిడి రిలీజ్‌కి ముందే ‘హనుమ్యాన్’ని చుట్టుముట్టింది. ధియేటర్ల లొల్లితో చాలా చాలా అడ్డంకులు ఎదుర్కొంది. మొత్తానికి పట్టు వదలని విక్రమార్కుడిలా హనుమంతుడు బరిలో నిలబడ్డాడు. ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి, ఇన్ని కష్టాలు పడిన ‘హనుమ్యాన్’ ఎలాంటి రిజల్ట్ అందుకుంది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
విలన్ యాంగిల్ నుంచి సినిమాకి హీరో అయిన ‘హనుమ్యాన్’ కథ మొదలవుతుంది. సౌరాష్ట్రలో వుండే మైఖేల్ (వినయ్ రాయ్) చిన్నతనం నుంచీ సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు. సహజంగా చిన్న పిల్లలందరిలోనూ వుండే కోరికే ఇది. కానీ, మైఖేల్ ఇంకాస్త గట్టిగా అనుకుంటాడు. అందుకు అడ్డమొస్తున్నారని కన్న తల్లితండ్రుల్నే మట్టుపెట్టేంత గట్టిగా. ఆ తర్వాత సూపర్ హీరో అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు తన స్థాయిలో. ఆ ప్రయోగాలు తనతో పాటు పెరిగి పెద్దవవుతుంటాయ్. కానీ, ఫలితం వుండదు. అయినా ఆగదు అతని ప్రయత్నం. అసలు సిసలు సూపర్ హీరో అయ్యే పవర్స్ ఎక్కడ దొరుకుతాయా.? అని ప్రపంచ వేట మొదలుపెడతాడు. మరోవైపు కథ అంజనాద్రికి వెళుతుంది. అదే హీరో వున్న చోటు. అక్కడ గణపతి (దీపక్ శెట్టి) ఊరు మీద పెత్తనం కోసం ఊరి జనాలను నానా హింసలకు గురి చేస్తుంటాడు. ఆ క్రమంలోనే హీరోయిన్ మీనాక్షి‌ (అమృతా అయ్యర్)తో గొడవకి దిగుతాడు. ఆమె ఇంటిపై గూండాలతో దాడి చేయిస్తాడు. ఈ క్రమంలో మన హీరోగారి ఎంట్రీ.. హనుమంతు ( తేజ సజ్జా) అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు. తల్లితండ్రులు లేకపోవడంతో అక్క అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) దగ్గర పెరిగి పెద్దవాడవుతాడు. తనకు మీనాక్షి అంటే ప్రాణం. మీనాక్షి జోలికి వచ్చిన విలన్ మనుషులతో పోరాటానికి దిగుతాడు. వారి చేతుల్లో చావు దెబ్బలు తింటాడు. చచ్చాడనుకున్న హనుమంతుని ఓ నదిలో పడేస్తారు విలన్ మనుషులు. అక్కడే అద్భుతం జరుగుతుంది. హనుమంతుడి రుధిరంతో రూపొందిన అత్యంత శక్తివంతమైన రుధిర మణి సాయంతో తిరిగి ప్రాణం పోసుకుంటాడు హనుమంతు. ఆ తర్వాత అపారమైన శక్తులు పొందుతాడు. తిరిగి వచ్చిన హనుమంతు విలన్ పని పడతాడు. ఇదే క్రమంలో సూపర్ మ్యాన్ పవర్స్ కోసం వేటాడుతున్న మైఖేల్‌కి ఈ విషయం తెలుస్తుంది. అంజనాద్రిలో ల్యాండ్ అవుతాడు. మరి, హీరో నుంచి ఆ రుధిర మణిని మైఖేల్ దక్కించుకున్నాడా.? ఆ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయ్.? తెలియాలంటే ‘హనుమ్యాన్’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
కేవలం రెండు సినిమాల అనుభవం వున్న తేజ సజ్జాకి ఇంత లార్జ్ స్కేలున్న సినిమా పడడం నిజంగా అదృస్టమే. ఆ అవకాశాన్ని తేజ సజ్జా బాగా యూజ్ చేసుకున్నాడు. భీభత్సమైన పోరాట ఘట్టాల్లో తనదైన బాడీ బిల్డింగ్ చూపించాడు. అలాగే భావోద్వేగాలను పంచడంలోనూ కట్టిపడేశాడు. తనదైన హ్యూమరస్‌తో ఆడియన్స్‌ని ఆధ్యంతం నవ్వించాడు. హీరోయిన్ అమృతా అయ్యర్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో అందంగా కనిపించి తనదైన పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పటిలాగే ఇంపార్టెన్స్ వున్న పాత్ర దక్కించుకుంది. తమ్ముడి జోలికి వస్తే ఎంతటి బలవంతులతోనైనా పోరాటానికి దిగగల సమర్ధురాలిగా బలంగా ఆమె పాత్రను డిజైన్ చేశాడు డైరెక్టర్. తనదైన టాలెంట్‌తో ఆ పాత్రకి న్యాయం చేసింది. విలన్‌గా వినయ్ రాయ్ పాత్ర కూడా అత్యంత శక్తివంతంగా డిజైన్ చేశాడు. హనుమంతుడంతటి బలవంతుడితో పోరాడగలిగే అత్యంత శక్తివంతుడైన మానవుడిగా ఈ పాత్ర చిత్రీకరణ వుంటుంది. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
పాత కథనే సరికొత్త కథనంతో తెరకెక్కించడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నూటికి నూరు మార్కులేయించుకున్నాడు. గతంలో ఈ తరహాలో చాలా సినిమాలొచ్చినప్పటికీ ఈ ‘హనుమ్యాన్’ ప్రత్యేకం అనదగ్గ సినిమానే. ప్రశాంత్ వర్మ సమ్‌థింగ్ స్పెషల్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నేపథ్య సంగీతం విషయానికి వస్తే.. పాటలు సిట్యువేషనల్‌గా సాగిపోతాయ్. ముగ్గురు సంగీత దర్శకులు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పై పెట్టిన ఫోకస్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌కి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలం అందించింది. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగుతుందంతే. అక్కడ కాస్త కత్తెర వేస్తే బాగుండేదేమో కొన్ని సన్నివేశాలు. నిర్మాణ విలువలు బాగున్నాయ్. మరీ ముఖ్యంగా చెప్పుకోవల్సింది విజువల్ ఎఫెక్ట్స్. అవే ఈ సినిమాకి మెయిన్ అస్సెట్. చాలా అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు గ్రాఫిక్స్. ముఖ్యంగా చివరి 15 నిముషాల్లో వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు. విఎఫ్ఎక్స్ భళా అనిపిస్తాయ్.

ప్లస్ పాయింట్స్:
కథ, కథనంలోని కొత్తదనం.. తేజ సజ్జా నటన, విజువల్ ఎఫెక్టులు.. హనుమాన్ గ్రాఫిక్స్.. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ సన్నివేశాలు..

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో కొన్ని సాగతీత సన్నివేశాలు..

చివరిగా:
‘హనుమ్యాన్’ పిల్లలూ, పెద్దలూ అందరూ కలిసి ధియేటర్లో చూడదగ్గ విజువల్ వండర్ మూవీ. చిన్న సినిమా అయినా పెద్ద పండగలాంటి సినిమా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com