సినిమా రివ్యూ: ‘సైంధవ్’

- January 13, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘సైంధవ్’

వయసుకు తగ్గ పాత్రలు చేయడంలో వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారు. ‘దృశ్యం’ సిరీస్‌లతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే, ‘ఎఫ్ 3’ సిరీస్‌లతో డిఫరెంట్ సక్సెస్ అందుకున్నారు. హ్యూమరిజం పండించడానికైనా.. సెంటిమెంట్ పండించడంలోనైనా వెంకటేష్ తనకు తానే సాటి. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వెంకటేష్ సినిమాలకు కనెక్ట్ అవుతుంటారు. తాజాగా ‘సైంధవ్’ సినిమాతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. తండ్రీ కూతురి సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ సెంటిమెంట్ ఈ మధ్య బాగా వర్కవుట్ అవుతోంది. ఆ నేపథ్యంలోనే వెంకటేష్‌కి కూడా ‘సైంధవ్’ కలిసొచ్చిందా.? లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
చంద్రప్రస్థ పోర్ట్‌లో ఉద్యోగం చేస్తున్న సైంధవ్ కోనేరు (వెంకటేష్)కు కూతురు గాయత్రి (సారా పాలేకర్) అంటే ప్రాణం. మనోజ్ఞ (శ్రద్ధా శ్రీనాధ్) క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ.. పక్కింట్లో వుంటుంది. భర్త (గెటప్ శీను) వేధింపులు తట్టుకోలేక అతడి మీద కేసు పెట్టి పుట్టింటికి వచ్చేస్తుంది. మనోజ్ఞకి పక్కింట్లో వుండే సైంధవ్ అంటే ప్రేమ. అతని పాపని తన సొంత కూతురులాగే చూస్తుంటుంది. కట్ చేస్తే.. ‘హాయ్ నాన్న’ సినిమాలోలాగే ఈ సినిమాలోనూ పాపకి ఓ భయంకరమైన వ్యాధి వుందని తెలుస్తుంది. అందుకోసం 17 కోట్ల విలువైన ఇంజక్షన్ ఇవ్వాలని డాక్టర్ సూచిస్తారు. మరి, ఓ సాధారణ పోర్ట్ ఉద్యోగిగా వున్న సైంధవ్ అంత ఖరీదైన ఇంజక్షన్ ఇప్పించి పాప ప్రాణాలను కాపాడుకోగలడా.? అసలు సైకో సైంధవ్ ఎవరు.? ఆ సైకీ, గ్యాంగ్ స్టర్స్‌కీ ఏంటి సంబంధం.? పాపకి ఇంజక్షన్ ఇచ్చే క్రమంలో వికాస్ (నవాజుద్ధీన్ సిద్ధిఖీ) ఎందుకు అడ్డు పడ్డాడు.? అసలు సైకో సైంధవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటీ.? పోర్టులో జరిగే అక్రమ స్మగ్లింగ్‌కీ, గ్యాంగ్‌స్టర్స్‌కీ, సైకో సైంధవ్‌కీ ఏంటీ సంబంధం.? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘సైంధవ్’ సినిమాని ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
సైకో సైంధవ్‌గా, సామాన్యుడు సైంధవ్‌గా రెండు డిఫరెంట్ వేరియేషన్లలో వెంకటేష్ బాగా నటించాడు. క్లాస్ అయినా, మాస్ అయినా.. సెంటిమెంట్ అయినా యాక్షన్ అయినా చక్కగా సెట్ అయిపోయే కటౌట్ వెంకటేష్ సొంతం. అందుకే చాలా ఈజీగా మౌల్డ్ అయిపోయాడు. యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసేశాడు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాధ్ నేచురల్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. గ్యాంగ్‌స్టర్‌‌కి అనుచరురాలిగా ఆండ్రియా బాగా చేసింది. విలన్‌గా నవాజుద్ధీన్ సిద్ధిఖీ తెలుగు, హిందీ మిక్స్ చేసిన డైలాగులు పలికి ఒకింత బోర్ కొట్టించేశాడనిపిస్తుంది. కస్టమ్స్ ఆపీసర్ పాత్రలో జయరామ్ పాత్ర ఓకే. మిగిలిన పాత్రధారులు ముఖేష్ రుషి, జిష్ణు సేన్ గుప్తా, తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
పాప సెంటిమెంట్ తరహాలో వచ్చిన ‘హాయ్ నాన్న’ ప్లెజెంట్ అప్పీల్ ఇచ్చింది. మంచి విజయం కూడా అందుకుంది. అయితే, ‘సైంధవ్’కి ఆ పోలిక కాస్త వున్నప్పటికీ కథ పూర్తిగా గ్యాంగ్‌స్టర్స్‌, యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో లింకప్ అయ్యుంటుంది. వాస్తవానికి ఈ సినిమా చూస్తున్నంతసేపూ కమల్ హాసన్ ‘విక్రమ్’, రజనీకాంత్ ‘జైలర్’ మూవీస్ జ్ఞప్తికి వస్తుంటాయ్. అలాగే, హాలీవుడ్ మూవీస్ చూసిన అలవాటున్న వాళ్లకి జాన్‌విక్ సిరీస్ కళ్ల ముందు కనిపిస్తుంటుంది. బహుశా డైరెక్టర్ కూడా జాన్‌విక్ స్టోరీని, నెరేషన్‌నీ తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్‌గా చూపించాలనుకున్నాడు కాబోలు ‘సైంధవ్’ సినిమాతో. యాక్షన్ ఎపిసోడ్స్ గట్రా బాగా డిజైన్ చేసినప్పటికీ, కాపీ కొట్టుడు, రొట్ట యవ్వారంలా తోస్తుంది.
ఫస్టాఫ్ అంతా ఓ మాదిరిగా నడిచినప్పటికీ, సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ బ్లాక్స్‌తో నిండిపోతుంది. ఆ రేంజ్ యాక్షన్.. సైకో తరహాలో హీరో క్యారెక్టర్‌ని డిజైన్ చేసిప్పటికీ.. ఆ రేంజ్ ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో ఎక్కడా కనిపించదు. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏమంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. అలాగే, సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఎడిటింగ్‌లో చాలా లోపాలున్నాయ్. ఒక సీన్‌కీ ఇంకో సీన్‌కీ ఏ మాత్రం లింక్ వుండదు. సడెన్‌గా కొన్ని సన్నివేశాలు వచ్చిపోతుంటాయంతే. నిర్మాణ విలువలు సినిమా స్థాయిలో వున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ ఎలా వున్నప్పటికీ కథ, కథనం నడిపిన తీరు మాత్రం అంత సంతృప్తికరంగా వుండదు. ప్రోమోస్‌లో వున్న సత్తా.. సినిమాలో చూపించడంలో డైరెక్టర్ శైలేష్ కొలను విఫలమయ్యాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
వెంకటేష్ యాక్షన్, భావోద్వేగ భరిత సన్నివేశాలు..

మైనస్ పాయింట్స్..
కాపీ రొట్ట కొట్టుడు కథ, కథనం, లింక్ లేని సన్నివేశాలు..

చివరిగా:
‘సైంధవ్’గా వెంకటేష్ వన్ మ్యాన్ షో చేసినప్పటికీ ‘హిట్’ సినిమాల తరహాలో డైరెక్టర్ మ్యాజిక్ ఈ మూవీకి వర్కవుట్ కాలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com