రామ జ్యోతిని వెలిగించిన ప్రధాని మోదీ

- January 22, 2024 , by Maagulf
రామ జ్యోతిని వెలిగించిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఈ మహత్తర ఘట్టం గురించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అయోధ్యలో బాల రాముడిని ప్రతిష్ఠించుకున్న సందర్భంగా సాయంత్రం దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ రామ జ్యోతిని వెలిగించాలని పౌరులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో బలరాముని విగ్రహాన్ని ఏర్పాటు చేసి దీపారాధన చేశారు. అలాగే సరయూ నది తీరంలో కొలువైన బాల రాముని ఆలయంలో దీపాలను వెలిగించారు.

అయోధ్యలో ఎటుచూసినా రామనామ సంకీర్తనలు.. ఆధ్యాత్మిక కోలాహలమే కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రతి ఇంటా ధర్మజ్యోతి వెలిగించాలన్నారు. అయోధ్యా నగరం ఒక వైపు విద్యుత్ కాంతులు, మరోవైపు దీపాలంకరణ మధ్య మిరిమిట్లుగొలుపుతోంది. ఈ కార్యక్రమంలో దీపాలు వెలిగించేందుకు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముని మహానామాన్ని జపిస్తూ తన్మయత్వంలో మునిగి తేలారు. అయోధ్యా నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో సరికొత్త తేజంతో కళకళలాడుతోంది. మరోవైపు భక్తులంతా శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేస్తూ దీపాలు వెలిగిస్తున్నారు. దీపోత్సవంతో హనుమాన్‌గడీ భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరాముడి ఆగమనానికి గుర్తుగా ఆలయాల్లో, ఇంటికి నలువైపులా భక్తులు దీపం వెలిగిస్తున్నారు. ప్రధాన గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెడుతున్నారు. ఇలా చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com