అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం సంక్రాంతి సంబరాలు

- February 06, 2024 , by Maagulf
అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం సంక్రాంతి సంబరాలు
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ప్రతి ఏటా నిర్వహించే సంక్రాంతి సంబరాలు,ఫిబ్రవరి 3, 2024న శనివారం స్థానిక సింగపూర్ పిజిపి హాల్ నందు అంగరంగ వైభవంగా జరిగాయి. సింగపూర్ లో తెలుగు సంస్కృతి,సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం ఈ కార్యక్రమాన్ని ఎంతో సాంప్రదాయబద్దంగా, తెలుగు లోగిళ్ళలో ఉండే పూర్తి పండుగ వాతావరణం లో నిర్వహించారు. 
 
ఆగ్నేయ ఆసియాలో ప్రప్రథమంగా సింగపూర్ కాలమానంలో గుణించిన తెలుగు క్యాలెండెర్ ఉండాలనే ఆలోచన చేసి,దాన్ని కార్యరూపం దాల్చేట్టు చేయటమే కాకుండా మరికొన్ని సంస్ధలకు సైతం స్పూర్తినిచ్చిన  తెలుగు సమాజం సింగపూర్ కాలమానంలో తెలుగు కాలెండర్ ని వరుసగా ఏడోసారి ఆవిష్కరించారు. వీటిని అందరికీ ఉచితంగా ఇవ్వటంతో పాటు ఆండ్రాయిడ్ మరియు ఐఓస్ నందు STS TELUGU CALENDER app ద్వారా అందరికీ అందుబాటులో ఉంచారు.
 
సంపూర్ణ సంక్రాంతి శోభతో తీర్చిదిద్దిన ప్రాంగణంలో హరిదాసు కీర్తనలు, యువతులతో గొబ్బెమ్మ పాటలు, సంప్రదాయ ఆటలు, భోగి పండ్లు వేడుక వంటి తెలుగింటి కార్యక్రమాలతో సింగపూర్ తెలుగు వారు చాలా సాంప్రదాయబద్దం గా జరుపుకున్నారు. మగువలకు రంగవల్లులు మరియు వంటల పోటీలు నిర్వహించి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందచేశారు. పిల్లలు మరియు పెద్దలచే పాటలు, నృత్య ప్రదర్శనలు , నాటికలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విభిన్న కార్యక్రమాల ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.సుమారు 35 మంది బాల బాలికలు రామాయణాన్ని చక్కగా ప్రదర్శించి ఆహుతుల మన్నలను పొందారు. సింగపూర్ తెలుగు మనబడి పిల్లలచే నిర్వహించిన ఈ ప్రదర్శన ప్రత్యేక ఆదరణ పొందింది. 
 
సమాజ కార్యవర్గం మరియు కొన్ని స్ధానిక రెస్టారెంట్స్ ల సహకారంతో ఏర్పాటు చేసిన మన అచ్చతెనుగు పిండివంటలు, 34 రకాల నోరూరించే వంటకాలతో కూడిన భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకొంది.
 
తెలుగు సంక్రాంతి వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన వారందరికీ STS అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పేరునా  సంక్రాంతి శుభాకాంక్షలు,ధన్యవాదములు తెలిపారు. తమ కార్యవర్గం గత సంవత్సర కాలంగా నిర్వహించిన కార్యక్రమాలను వివరించడంతో పాటు అందరూ మరింత సహాయ సహకారాలను అందించాలని, 50వ ఆవిర్భావ దినోత్సవం లోపు సమాజ భవన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తోడ్పాటు నందించాలన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 700 తెలుగు వారు హాజరైనారని, ఫేస్బుక్ లైవ్ ద్వారా 5,000 మంది వీక్షించినట్లు నిర్వాహకురాలు సుప్రియా కొత్త తెలిపారు. భోగి రోజున సుమారు 1,000 మందికి రేగి పండ్లను అందించామని , అలానే అయోధ్య బాల రాముని ప్రతిష్టాపన సందర్భంగా అక్కడనుంచి ప్రత్యేకంగా తెప్పించిన దివ్యాక్షతలను సుమారు 1,000 మందికి పంచామన్నారు.కార్యక్రమానికి హాజరైన వారికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ, స్వచ్ఛంద సేవకులకు  మరియు కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు కార్యవర్గం తరుపున గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com