సినిమా రివ్యూ: యాత్ర 2..

- February 08, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: యాత్ర 2..

వైఎస్సార్(YSR) బయోపిక్ గా దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2(Yatra 2) వచ్చింది. యాత్ర సినిమా వైఎస్సార్ బయోపిక్ గా రాగా యాత్ర 2 జగన్ బయోపిక్ గా వచ్చింది. నేడు ఈ యాత్ర 2 సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. ఇక ఈ సినిమాని మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కథ విషయానికొస్తే..
ఈ కథ మనందరికీ తెలిసిందే. వైఎస్సార్(మమ్ముట్టి) తన కొడుకు జగన్(జీవా) ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నాను అని ప్రజలకు పరిచయం చేస్తూ కథ మొదలవుతుంది. తర్వాత ఏపీలో గెలవడం, వైఎస్సార్ సీఎం అవ్వడం చూపిస్తారు. అనంతరం వైఎస్సార్ మరణం, జగన్ ఓదార్పు యాత్ర, హైకమాండ్ ఓదార్పు యాత్రని ఆపేయమనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టడం, బై ఎలక్షన్స్ లో గెలవడం, జగన్ పై సిబిఐ దాడులు, జగన్ అరెస్ట్ వంటి అంశాలు చూపిస్తారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని విభజించడం, చంద్రబాబు(మహేష్ మంజ్రేకర్) సీఎం అవ్వడం, మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం, పాదయాత్ర చేయడం చూపిస్తారు. చివర్లో 2019 లో జగన్ సీఎం అవ్వడంతో సినిమాని ముగిస్తారు.

సినిమా విశ్లేషణ..
కథ అందరికి తెలిసిన కథే కావడంతో కథనంపై దర్శకుడు చాలా శ్రద్ధ పెట్టాడు. ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా అయినా తండ్రి కోసం, ఇచ్చిన మాట కోసం నిలబడే కొడుకు కథగా ఎమోషనల్ గా రన్ చేసారు. 2009 – 2019 మధ్యకాలంలో జరిగిన రాజకీయాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలని తీసుకొని తెరకెక్కించారు. సినిమాలో జగన్, వైఎస్సార్, చంద్రబాబు.. అంటూ క్యారెక్టర్స్ కి అన్ని ఒరిజినల్ పేర్లే వాడటం గమనార్హం. పార్టీల పేర్లు మాత్రం మార్చారు. సినిమాని ఓ పక్క ఎమోషనల్ గా రన్ చేస్తూనే మరో పక్క జగన్ పాత్రకి ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. కాకపోతే తెలిసిన కథ కావడం, ఎక్కువ ఎమోషనల్ గా రన్ చేయడంతో కొన్ని చోట్ల మాత్రం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక వైఎస్సార్ మరణం అప్పుడు రియల్ విజువల్స్, చివర్లో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేయడం కూడా రియల్ విజువల్స్ చూపించడం గమనార్హం. అయితే తెలిసిన కథనే ఏ రేంజ్ లో ఎమోషనల్ గా నడిపించాడు అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటులు..
గతంలో యాత్ర సినిమాలో మమ్ముట్టి ఎంతగా ఒదిగిపోయారో, ఈ సారి వైఎస్ జగన్ పాత్రలో జీవా కూడా అంతే ఒదిగిపోయాడు. నటుడిగా జీవా మాత్రం తన 100 శాతం బెస్ట్ ఇచ్చాడనే చెప్పొచ్చు. మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో సినిమా మొదట్లో పది నిముషాలు కనిపించి మెప్పిస్తారు. ఇక వైఎస్సార్ భార్య విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి అదరగొట్టారు అని చెప్పొచ్చు. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్.. మిగిలిన నటీనటులు కూడా మెప్పించారు.

సాంకేతిక విలువలు..
దర్శకుడు మహి వి రాఘవ్ సినిమాలకు మంచి పేరే ఉంది. యాత్ర సినిమాతో అందర్నీ మెప్పించిన మహి రాఘవ్ ఇప్పుడు యాత్ర 2 పొలిటికల్ బయోపిక్ అయినా ఎక్కువగా ఎమోషనల్ గా కథనం నడిపించి, దర్శకుడిగా కూడా మరోసారి సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో BGM, జగన్ పాత్రకి ఎలివేషన్స్ లో ఇచ్చిన BGM హైలెట్ గా నిలుస్తుంది.మొత్తంగా యాత్ర 2 సినిమా కూడా యాత్ర లాగే పొలిటికల్ బయోపిక్ అయినా ఎమోషనల్ గా రన్ చేసి ప్రేక్షకులని మెప్పించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. గత ఎన్నికల ముందు యాత్ర సినిమా వచ్చి ఎలా మెప్పించిందో ఇప్పుడు యాత్ర 2 కూడా అదేవిధంగా ప్రేక్షకులని మెప్పిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com