హైదరాబాద్-శ్రీశైలం రూట్‌లో తొలిసారిగా 10 ఏసీ రాజధాని సర్వీసులు
- February 10, 2024
మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్ ప్రెస్ బస్సులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం
తెలంగాణ: మహాలక్ష్మి పథకం అమలు వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి 1325 బస్సులను దశలవారీగా వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేసింది. అందులో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్ ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి/రాజధాని బస్సులున్నాయి. వాటిలో ఇప్పటికే కొన్ని బస్సులను వాడకంలోకి తెచ్చిన సంస్థ.. తాజాగా మరో 100 బస్సులను ప్రారంభించింది.
హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాం వద్ద శనివారం 100 కొత్త బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన 60 రోజుల వ్యవధిలోనే 15 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించగా.. అందుకు సంబంధించిన రూ.535 కోట్ల చెక్ ను మహిళలతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కు ముఖ్యమంత్రి అందజేశారు.
అంతకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతోనే మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా తొలి ప్రభుత్వ హామీని అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని అన్నారు. ప్రకటించిన 48 గంటల్లోనే పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మహాలక్ష్మి పథకం అమలు వల్ల రోజుకు సగటున రూ.13 కోట్లు, ప్రతి నెల రూ.300 నుంచి 400 కోట్లు భారం పడుతున్నా.. వెనకడుగు వేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. త్వరలో జరగబోయే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
కొత్తగా అందుబాటులోకి వస్తోన్న ఈ 100 బస్సుల్లో.. 90 ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయని, ఇవి మహాలక్ష్మి-ఉచిత బస్సు ప్రయాణ స్కీంకు ఉపయోగపడతాయన్నారు. అలాగే, శ్రీశైలం ఘాట్ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా సంస్థ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు.
ఆర్టీసీ సిబ్బందికి పెండింగ్ బకాయిలను పరిష్కరించేందుకు రూ.280 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
మహాలక్ష్మి పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా 2200 కొత్త బస్సులకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అందుకు సహకరించాలని ముఖ్యమంత్రి ని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కోరారు. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో ప్రతి ఆర్టీసీ బస్సు నిండుగా తిరుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహాలక్ష్మి అమలుకయ్యే నిధులను ఎప్పటికప్పడు టీఎస్‌ఆర్టీసీకి చెల్లిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ సిబ్బంది అద్భుతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వారే ఉంటారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







