2050 పేరుతో మాస్టర్ ప్లాన్‌పై టీ-సర్కార్‌ కసరత్తు!

- March 04, 2024 , by Maagulf
2050 పేరుతో మాస్టర్ ప్లాన్‌పై టీ-సర్కార్‌ కసరత్తు!

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని నలువైపులా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాబోయే 30-40 ఏళ్ల అవసరాలు తీర్చడంతో పాటు దేశ, విదేశీ నగరాలను మించి వృద్ధి నమోదయ్యేలా హైదరాబాద్‌ను డెవలప్‌ చేయాలని సర్కార్‌ భావిస్తోంది. దీనికోసం 2050 మాస్టర్‌ ప్లాన్‌కు రూపకల్పన చేయాలని ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే దీనికోసం అన్ని విభాగాలను సమాయత్తం చేసింది.

జీహెచ్‌ఎంసీకి ఒక మాస్టర్ ప్లాన్, హెచ్ఎండీఏకు మరో మాస్టర్ ప్లాన్, సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ డెవలప్‌మెంట్‌ అథారిటీ వంటి పలు ప్రణాళికలను ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తోంది. వాటన్నింటి స్థానంలో సమగ్ర ప్లాన్‌ను తీసుకువచ్చేందుకు సర్కార్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకసారి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయితే అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. దీంతో రియాల్టీ రంగ అభివృద్ధి ప్రణాళికబద్ధంగా సాగుతుంది.

ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసే అవకాశం:
2050 మాస్టర్ ప్లాన్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధికి భూములు కేటాయిస్తారనేది ముందుగానే తెలుస్తుంది. పరిశ్రమలకు, ఫార్మా సిటీకి, ఐటీ పరిశ్రమలకు, గ్రీన్ జోన్‌కు, రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రియాల్టీ మార్కెట్‌ మరింత పెరిగే అవకాశముంది. వృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లో రియాల్టీ మార్కెట్‌ పెరగడంతో పాటు కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కూడా పెరిగే చాన్స్‌ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక సిటీకి సమగ్ర మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే రింగ్ రోడ్డు నుంచి సిటీకి, రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రత్యేక కనెక్టివిటి పెరుగుతుంది. మెట్రో రైల్ కనెక్ట్ విషయంలో కూడా క్లారిటీ రావడమే కాకుండా ప్రాజెక్టుకు అడుగులు పడుతాయి. వీటితోపాటు విద్యుత్, త్రాగు నీటి సరఫరా వంటి మౌలిక విషయాల్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మాస్టర్ ప్లాన్ 2050 అమలు… గ్రేటర్ హైదరాబాద్‌లో రియాల్టీకి చక్కని ఊతం ఇచ్చే చాన్స్‌ ఉందంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com