సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి

- March 29, 2024 , by Maagulf
సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి

ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలోపడి 45 మంది మరణించిన విషాద ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. ఈస్టర్ పండుగ కోసం జియాన్ చర్చికి (జియాన్ చర్చి ఆ దేశంలో ఉన్న పెద్ద చర్చిల్లో ఒకటి) వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు బ్రిడ్జిపై నుంచి సుమారు 165 అడుగుల లోతులో పడటంతో మంటలు చెలరేగి ప్రయాణీకులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 46 మంది ఉన్నారు. వీరిలో ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ప్రాణాలతో బతికున్న బాలికను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

బోట్స్ వానా నుంచి దక్షిణాఫ్రికాలోని మోరియాకు బస్సు వెళ్తుంది. కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపు తప్పి బస్సు లోయలో పడినట్లు అధికారులు తెలిపారు. ఎనిమిదేళ్ల చిన్నారి మినహా బస్సులోని వారంతా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మృతులంతా బోట్స్ వానా ప్రాంతానికి చెందిన వారు. బస్సు లోయలో పడగానే మంటలు వ్యాపించడంతో మృతదేహాలు కాలిపోయాయని, కొన్ని మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి ఉందని అధికారులు చెప్పారు. మృతుల కుటుంబాలకు బోట్స్ వానా, దక్షిణాఫ్రికా దేశాధ్యక్షులు సానుభూతి తెలిపారు. ఈస్టర్ వీకెండ్ నేపథ్యంలో వంతెనపై విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని స్థానిక యంత్రాంగం తెలిపింది. గత ఏడాది దేశంలో నాలుగు రోజుల వారాంతంలో జరిగిన ప్రమాదాల్లో 252 మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com