త్యాగమూర్తి గురు తేగ్ బహదూర్

- April 01, 2024 , by Maagulf
త్యాగమూర్తి గురు తేగ్ బహదూర్

`మనిషి మృత్యువుకు చాలా భయపడతాడు. ఆ భయం కారణంగానే మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడతాడు. జీవితంలో విలువలు వదిలిపెడతాడు. పిరికివాడుగా మారతాడు. చనిపోయేవాడికి ఆ భయం ఉండదు. దాని గురించి చింత ఎందుకు.’ అంటారు గురు తేగ్ బహదూర్.నేడు గురు తేగ్ బహదూర్ జయంతి.

వైశాఖ కృష్ణ పంచమి (పూర్ణిమాంతం) నాడు 6వ సిక్కు మత గురువు గురు హరగోబింద్ , తల్లి నానకీ  దేవిలకు అమృత్ సర్ పట్టణంలో  ఏప్రిల్ 1, 1621న జన్మించారు. చిన్నతనంలోనే విలువిద్యలు, గుర్రపు స్వారీ మొదలైన యుద్ధ కళల్లో శిక్షణ పొందారు, ప్రాచీన సాహిత్యాన్ని చదువుకున్నారు.అనంతరం ఆధ్యాత్మిక చింతనతో ఇల్లు విడిచి బకాలా ప్రాంతంలో సుమారు 28 సంవత్సరాల పాటు ధ్యానం చేస్తూ సాధారణ యోగి జీవితాన్ని కొనసాగించారు.

మశూచి సోకడంతో 1664, మార్చి 30వ తేదీన 6వ సిక్కు మత గురువు గురు హర్ కిషన్ పరమపదించగా,ఆయన స్థానంలో  యోగి పుంగవుడైన గురు తేగ్ బహదూర్ 9వ సిక్కు మత గురువుగా ఆగస్టు 1664లో ఎంపికయ్యారు.దివాన్ దుర్గా మాల్ నేతృత్వంలోని సంగత్ గురుత్వాన్ని తేగ్ బహదూర్ కు ఇస్తూ అధికారిక లాంఛన యుతమైన తిక్కా వేడుకలు నిర్వహించింది.తేగ్ బహదూర్ ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. సృజన, సమరసత, మానసిక వికారాలపై విజయం సాధించడం కోసం సాధన చేయాలని గురు తేగ్ బహదూర్ ఉపదేశించారు.

సిక్కు మత పవిత్ర గ్రంథమైన  గురు గ్రంథ్ సాహిబ్ లో అనేక కృతులు ఆయన రచించినవి చేరాయి, వాటిలో గ్రంథ్ సాహిబ్ చివరిలో వచ్చే సలోక్ లు, ద్విపదలు కూడా ఉన్నాయి. ఆయన రచనల్లో116 శబద్ లు, 15 రాగాలు, సిక్ఖు మత సంప్రదాయంలోని బనిలో భాగమైన 782 కృతులు ఉన్నాయి.

గురు తేగ్ బహదూర్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఢాకా, అస్సాం ప్రాంతాలలో  గురు తేగ్ బహదూర్ విస్తారంగా పర్యటించి తొలి సిక్కు గురువు నానక్ బోధనలను ప్రవచించారు. ఆయన పర్యటించి, నివసించిన ప్రాంతాలు తర్వాత కాలంలో  సిక్కు  మందిరాలు, లాంగర్లు (పేదల కోసం స్వచ్ఛంద సముదాయ వంటశాల) నెలకొల్పారు.

కాశ్మీర్ పండిట్లను ఇస్లాం మతంలోకి మారేందుకు బలవంత పెడుతున్న మొఘల్ పరిపాలకులకు వ్యతిరేక పోరాటం చేశారు. అంతే కాదు ఇస్లాం మతంలోకి మారమంటే  మారను అని తిరస్కారం వ్యక్తం చేసినందుకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో ఢిల్లీ లో బహిరంగంగా అందరూ చూస్తుండగానే అయన శిరచ్చేదన జరిగింది. 

తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వ్యక్తి గురు తేగ్ బహదూర్.  తొమ్మిదవ సిక్కు మత గురువుగా ఆయన కర్తృత్వం శారీరిక, మానసిక శౌర్యానికి గుర్తుగా నిలచింది. ఆయన గురువాణి అందరి మనస్సుల్లో నిలిచిపోయింది.ఆయన చూపిన విలువలతో కూడిన మార్గాన్ని అనుసరిస్తూ మనం ముందుకు సాగడమే మనం ఆయనకిచ్చే అసలైన  గౌరవం.   

           --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com